రూ.48వేల కోట్లు కాగ్ లెక్కల్లోనే లేవు : యనమల రామకృష్ణుడు

మూడేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం అప్పులు, అవినీతి, వ్యవస్థల విధ్వంసం తప్ప సాధించిందేమీలేదని, ఎఫ్ఆర్ బీఎం నిబంధనలు కూడా కాదని ఇష్టారాజ్యంగా అప్పులు తెస్తోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రజలకోసం ఖర్చు పెడుతున్నామనిచెప్పడం పచ్చిఅబద్ధమని, 2020-21 కాగ్ నివేదికను పరిశీలిస్తే, జగన్ ప్రభుత్వం రూ.48వేలకోట్లకుపైగా సొమ్ముని లెక్కా పత్రంలేకుండా దుర్వినియోగంచేసినట్టు స్పష్టమవుతోందని విమర్శించారు. ఈ మేరకు శనివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. 2020-21లో ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి రూ.లక్షా73 వేల కోట్లకుపైగా ఖర్చుపెట్టినట్టు చెబుతోందని, కానీ దానిలో రూ.48వేలకోట్లకు పైగాసొమ్ము దుర్వినియోగమైనట్టు కాగ్ నివేదిక చెబుతోందన్నారు.

ప్రజల సొమ్ము దుర్వినియోగమైందని, రూ.48వేలకోట్లకుపైగా సొమ్ము ఏమైందని కాగ్ పలుమార్లు ప్రశ్నించినా ప్రభుత్వంనుంచి సమాధానంలేదన్నారు. ఆ సొమ్ము ఎవరిజేబుల్లోకి వెళ్లిందనేది చెప్పాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానిదనని డిమాండ్ చేశారు. కాగ్ ఇప్పుడు అంటున్నదే..టీడీపీ ఇది వరకే ప్రజలసొమ్ము అంతా వైసీపీనేతల జేబుల్లోకి వెళుతోందని చెప్పిందని తెలిపారు. కేపిటల్ ఎక్స్ పెండేచర్ కింద రూ.18వేలకోట్లపైన ఖర్చుపెడితే, రెవెన్యూ డెఫిషియన్స్ రూ.35వేలకోట్లపైగా ఉంటోందని, అసలు ఇలాంటి దారుణాలు ఎక్కడాచూడమని తెలిపారు. 2019-20, 2020-21 ఆర్థికసంవత్సరాల్లో కేపిటల్ ఎక్స్ పెండేచర్ కి, రెవెన్యూలోటుకిచాలా వ్యత్యాసం ఉందన్నారు.

న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపై చట్టసభల్లో మాట్లాడకూడదనే నిబంధనను తుంగలో తొక్కారని,  అమరావతి అంశంపై ప్రతిపక్షాలపై బురదజల్లి, ప్రజలను తప్పుదోవపట్టించే తంతుని చట్టసభల్లో కొనసాగించారని మండిపడ్డారు. రూ.48వేలకోట్ల ప్రజలసొమ్ము ఏమైందనేదానిపై కేంద్రప్రభుత్వం దృష్టపెట్టాలని,  సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టకపోతే ఏపీ ఆర్థికంగా ఎవరూ ఊహించని విధంగా దెబ్బతింటుందని, ఆర్టికల్ 360 ప్రకారం రాష్ట్ర ఆర్థిక వ్యవవస్థ దెబ్బతిన్నప్పుడు, ప్రజలసొమ్ముకు పాలకులుచేస్తున్న దోపిడీకి సంబంధంలేనప్పుడు కేంద్రం జోక్యంచేసుకోవచ్చన్నారు. శాసనసభలను, చట్టాలను, కోర్టులను గౌరవించినప్పుడే రాజ్యాంగానికి విలువ ఉంటుందన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *