టీడీపీ వల్లే రోడ్లు బాగోలేవు : మంత్రి శంకర్ నారాయణ
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితికి గత టీడీపీ ప్రభుత్వమే ముమ్మాటికీ కారణమని మంత్రి శంకరనారాయణ ఆరోపించారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం ఏటా రూ.8 వేల కోట్లు వెచ్చించాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం ఏటా కేవలం రూ.2 వేల కోట్లే కేటాయించిందన్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే రోడ్ల దుస్థితికి కారణమని ఆరోపించారు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తే… తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.10,360 కోట్లు వెచ్చించిందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.10,660 కోట్లు తేగలిగితే.. సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలోనే రూ.11,500 కోట్లను కేంద్రం నుంచి రాబట్టారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో రహదారుల పరిస్థితి దారుణంగా తయారైన వైనంపై ఇప్పటికే పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే రోడ్ల దుస్థితికి మీరు కారణమంటే.. కాదు మీరే కారణమంటూ అధికార వైసీపీ,విపక్ష టీడీపీలు ఒకరిపైమరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ టీడీపీ ప్రభుత్వ పాలనపై తనదైన విమర్శలు గుప్పించారు.
2010 నుంచి 2019 వరకు కాంగ్రెస్, చంద్రబాబు ప్రభుత్వాలు రోడ్ల నిర్వహణను గాలికొదిలేయడంతో రాష్ట్రంలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. గత రెండున్నరేళ్లలో భారీ వర్షాలతో మరమ్మతుల్లో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, ప్రస్తుతం రోడ్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. 2019 ఎన్నికల ముందు రోడ్ల పునరుద్ధరణ కోసం తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని టీడీపీ ప్రభుత్వం రాజకీయ ప్రచార పథకాల కోసం మళ్లించిందన్నారు.