‘డేంజరస్’ సినిమాను వాయిదా వేసిన ఆర్జీవీ
ప్రచార చిత్రాలతో, వివాదాలతో సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకు రావడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మించినవారు మరొకరు లేరు. అటువంటి వర్మ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు లెస్బియన్‌గా మారితే ఎలా ఉంటుందనే కొత్త కథతో ఆర్జీవీ తీశాడు. ఓ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న “డేంజరస్ “లో ఇద్దరు అమ్మాయిల మధ్య రొమాన్స్‌ను హైలెట్ చేస్తున్నాడు ఆర్జీవీ. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి.
తాజా చిత్రం డేంజరస్ విడుదలను ఆయన వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు గల కారణాన్ని కూడా వివరిస్తూ కాసేపటి క్రితం వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మా ఇష్టం డేంజెరస్ సినిమా విడుదల విషయంలో లెస్బియన్ సబ్జెక్ట్ కారణంగా థియేటర్లో విడుదల చేసేందుకు యజమానులు ముందుకు రావటం లేదు. దీంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే మరో విడుదల తేదీని వెల్లడిస్తాం’’ అని వర్మ ట్వీట్ చేశారు.
ఇక ఇటీవల ‘మాఇష్టం’ గురించి వర్మ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పోస్టర్ చూసినా, ట్రైలర్ చూసినా ‘పెద్దవాళ్లకి మాత్రమే’ తరహా సినిమానేమో అనే అభిప్రాయం కలుగుతుంది. నిజానికి ఇదొక క్రైమ్ డ్రామా. స్వలింగ సంపర్కులైన ఇద్దరు మహిళల ప్రేమకథగా సాగుతుంది. ఇన్నేళ్లుగా ఇన్ని సినిమాలు చేశాక నేనొక ప్రయోగం చేస్తే నాకు పోయేదేమీ లేదు’ అని చెప్పుకొచ్చారు. అయితే ఇంతకు ముందుగు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. మరికొన్ని సినిమా థియేటర్స్ కూడా డేంజరస్ మూవీ ప్రదర్శనకు ముందుకు రాలేదట. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఆర్జీవి.