బీజేపీకి రావెల రాజీమానా..అడుగులు ఎటువైపు..?
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్ట నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు తన రాజీనామా లేఖను పంపారు. సుస్థిరమైన, సమర్థవంతమైన పరిపాలనా విధానానికి ఆకర్షితుడినై బీజేపీలో చేరానని, అంబేద్కర్ పట్ల నరేంద్రమోడీకి ఉన్న గౌరవం, అభిమానం తనను మరింతగా బీజేపీ వైపు మళ్లించిందని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ, ఆర్థిక, రాజకీయ అసమానతలు తగ్గి ప్రపంచంలోనే శక్తి వంతమైన దేశంగా రూపొందడానికి మోడీ నాయకత్వం దేశానికి అవసరమని భావిస్తున్నానని వివరించారు. అయితే వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించి కారణాలతో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు.
పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే రావెల కిషోర్ బాబు తన సొంతగూడైన టీడీపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన గుంటూరు జిల్లాల టీడీపీ సీనియర్ నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. పార్టీలోకి తీసుకుని ప్రత్తిపాడు టికెట్ తనకే ఇస్తారని అనుచరుల వద్ద రావెల చెప్తున్నారని వినిపిస్తోంది. అయితే రావెల రాక అంత తేలిగ్గా ఉండదని మరికొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు.
బీజేపీలో ఉంటే రాజకీయ ఎదుగదల ఉండదన్న బావనతోనే టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని లోగుట్టుగా విమర్శిస్తున్నారు. టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పార్టీలోకి చేరికలు మొదలయ్యాయని అంటున్నారు. అయితే రావెల చేరుతారా..లేదన్నది ఆయనే క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీ అధికారంలో ఉండగా మంత్రి పదవి నుండి తీసేసిన అనంతరం రావెల జనసేనలో చేరారు. 2019లో ప్రత్తిపాడు నుండి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీకి కూడా రాజీనామా చేశారు.