వచ్చే ఎన్నికల్లో యువతకే ప్రాధాన్యం : టీడీపీ అధినేత చంద్రబాబు

తెలుగుజాతి పండుగ వాతావరణంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు చేస్తున్నారని,  గ్రామ కమిటీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త వేడుకలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆవిర్బావ సభలో ఆయన ప్రసంగించారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయని సంతోషించారు. అధికారం కోసం ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేయలేదని, తెలుగువారి సంక్షేమమే టీడీపీ పరమావధి అని తెలిపారు. తెలుగుజాతికి పునరంకితం కావాల్సిన సమయం వచ్చిందని, తెలుగువారి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు.

తెలుగుజాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఉంటారని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరి రక్తంలో తెలుగుదేశం పార్టీ ఉందని, ప్రజల నరనరాల్లో తెలుగుదేశం పార్టీ జీర్ణించుకుపోయిందన్నారు. 21 ఏళ్లు అధికారంలో ఉన్నాం.. 19 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని తెలిపారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తమది ప్రజాపక్షమేనన్నారు. నవతరానికి నాంది పలికిన వ్యక్తి ఎన్టీఆర్ అని, పటేల్-పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్ రద్దు చేశారని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు తీసుకువచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని, యువతను ప్రోత్సహించాలని టీడీపీ నిర్ణయించిదన్నారు.

యువత గర్వంగా పనిచేయాలంటే టీడీపీ ఉండాలన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. టీడీపీ కుటుంబంలో 70 లక్షల మంది సభ్యులు ఉన్నారని, టీడీపీని నమ్ముకున్న వారంతా తన కుటుంబసభ్యులేనని అభిప్రాయపడ్డారు. పార్టీని కాపాడింది.. జెండా మోసింది కార్యకర్తలని, కార్యకర్తలపై దాడులు జరిగినా జెండా వదల్లేదని, కార్యకర్తల రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  పార్టీ శ్రేణులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *