రాజధానిపై జగన్ సంచలన నిర్ణయం
శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ,కార్య నిర్వాహక వ్యవస్థ దేనికవే స్వతంత్రమైనవని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏ వ్యవస్థ అయినా తమ పరిధిలో పనిచేస్తేనే మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయని తెలిపారు. మూడు రాజధానుల, సమగ్రాభివృద్ధిపై అసెంబ్లీలో జరిగిన చర్చలో జగన్ ప్రసంగించారు. ఏ వ్యవస్థైనా పరిధిలో నిర్వహించకపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయన్నారు. చట్టాన్నే వెనక్కి తీసుకున్నాం..దీనిపై తీర్పు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. శాసనసభ ఓ చట్టాన్ని చేయాలా వద్దా అని కోర్టులు నిర్ణయించలేవు తేల్చి చెప్పారు.
ప్రభుత్వాలు చేసే చట్టాలు నచ్చకుంటే ప్రజలు ఓటు ద్వారా తీర్పు చెప్తారని అన్నారు. ఆరు నెలల్లో రాజధానిని వేల కోట్లతో పూర్తి చేయాలని చెప్పడం సాధ్యం కాని టైం లైన్ ను నిర్దేశించడం సరికాదన్నారు. వికేంద్రీకరణ వల్ల ఏపీ అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీనే చెప్పిందని గుర్తు చేశారు. ఈ ప్రాంతంపై అభిమానం లేదు కాబట్టే చంద్రబాబు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడని, కనీస మౌలిక వసతుల ఏర్పాటుకే లక్ష కోట్లు ఖర్చు అయితే పూర్తి రాజధాని ఏర్పాటుకు ఎన్ని లక్షల కోట్లు అవుతుందని ప్రశ్నించారు.
చంద్రబాబు ఈ ప్రాంతంపై అభిమానం ఉంటే.. ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ లేదంటే గుంటూరులో చంద్రబాబు రాజధాని పెట్టేవాడన్నారు. అటు విజయవాడ కాదు.. ఇటు గుంటూరు కాదు.. దేనికైనా 40 కి.మీ దూరం ఉందన్నారు. రాజధాని అభివృద్ధిలో రాజధాని నిర్మాణం అనేది ఒక చిన్న అంశం మాత్రమేన్నారు. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోమన్నారు. అడ్డంకులు ఎదురైనా.. వికేంద్రీకరణ ఒక్కటే సరైన మార్గమని తేల్చి చెప్పారు. అందరికీ మంచి చేయడం ప్రభుత్వం ముందున్న మార్గమన్నారు. రాబోయే తరాలకు మంచి చేయడం ప్రభుత్వం లక్ష్యమన్నారు. న్యాయవ్యవస్థ మీద అచంచల విశ్వాసం, గౌరవం తమకు ఉందన్నారు.