వైసీపీ ఎమ్మెల్యేని చితకబాదిన సొంత పార్టీ కార్యకర్తలు
వైసీపీ ఎమ్మెల్యేపై అదే పార్టీ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఊరిలో నిర్భందించి సైతం చితకబాదారు. పోలీసుల వలయం నుండి తప్పించుకుని సైతం ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారు. వివరాళ్లలోకి వెళ్తే ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యారు. మెడను, చేయిని వేరు చేసి దారుణంగా చంపేశారు. గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పరామర్శించేందుకు వెళ్లారు. అయితే ప్రసాద్ హత్య వెనక ఎమ్మెల్యే హస్తం ఉందని హతుడి బంధువులు, గ్రామస్థులు అనుమానానికి లోనయ్యారు.
దీంతో కోపోద్రిక్తులైన వారు ఒక్కసారిగా ఎమ్మెల్యేపై మూకుమ్మడి దాడికి దిగారు. అందినకాడికి ఒకరు వెంట ఒకరు కొట్టారు. పోలీసులు అడ్డుకున్నా ఆగలేదు. కాస్తదూరం తరుముకున్నారు. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. గ్రామస్తులు, వైసీపీ కార్యకర్తలు చుట్టముట్టడంతో ఏం చేయాలో తెలియక ఓ స్కూలులో తలారిని పోలీసులు దాచి పెట్టారు. చిరిగిన చొక్కాను స్కూలులో మార్చుకున్నారు. ఇదే సమయంలో పోలీసులపైనా గ్రామస్తులు రాళ్ల వర్షం కురిపించారు.
ఓ కానిస్టేబుల్ కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. సుమారు నాలుగు గంటల సేపు స్కూల్లోనే తలారి వెంకట్రావు తల దాచుకున్నారు. చివరకు సొమ్మసిల్లి పడిపోయారు. స్కూలును గ్రామస్తులు చుట్టముట్టారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఏకంగా ఎస్పీ అదనపు బలగాలతో రంగంలోకి దిగారు. అయితే జి.కొత్తపల్లి ఘటనపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఖండించారు. పరామర్శకు వెల్లిన ఎమ్మెల్యేపై దాడి దారుణమని, దాడికి వెనక టీడీపీ నేతలు ఉన్నారని, చంద్రబాబు కుతంత్రాలు సాగవని హెచ్చరించారు.