ఎన్టీఆర్ విగ్రహాలు కూలుస్తూ గౌరవం ఉన్నట్లు మాట్లాడుతున్నారు : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర

జిల్లాల వికేంద్రీకరణ చేసినట్లే.. మూడురాజధానులకు కూడా కట్టుబడి ఉంటామంటూ ప్రభుత్వం మూర్ఖంగా మాట్లాడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర విమర్శించారు. సమదూరంలో జిల్లాలలను ఏర్పాటు చేశామన్న సీఎం విశాఖను రాజధాని చేస్తే రాయలసీమ వాసులకు ఎలాదగ్గరవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలు వెళ్లాలంటే ఎన్నిఇబ్బందులుంటాయో చూడాలని సూచించారు. ప్రజల వినతులు, ఆలోచనలను ఈ ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. నెల్లూరుజిల్లా కేంద్రానికి 15 నిమిషాల ప్రయాణదూరంలో ఉన్న గూడూరును తీసుకెళ్లి తిరుపతిలో కలిపారని మండిపడ్డారు.


హిందూపురాన్ని సత్యసాయిజిల్లాలో కలిపారని, కావలికి చుట్టుపక్కల ఉండే మండలాలను తీసుకెళ్లి కందుకూరు డివిజన్ లో కలిపారన్నారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటుచేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పెట్టిన ఎన్టీఆర్ పేరును రాజశేఖర్ రెడ్డి తొలగించింది నిజంకాదా? అని నిలదీశారు. ఎన్టీఆర్ ను ఆనాడు అవమానించిన రాజశేఖర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించలేదన్నారు. పథకాలకు ఉన్న ఎన్టీఆర్ పేరును జగన్ రద్దు చేశారన్నారు. పేదల కడుపునింపే అన్నాక్యాంటీన్లు కూడా తీశారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకివచ్చినప్పటినుంచీ ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చే పనిలోనే ఉన్నారన్నారు.
ఓ వైపు విగ్రహాలు కూలుస్తూ మరోవైపు జిల్లాకు పేరు పెట్టామంటూ సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కీర్తిప్రతిష్టలు జగన్ స్వార్థానికి వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న పోరాటం ప్రజల్లోకి వెళ్లకూడదన్న కుఠిలబుద్ధితోనే కొత్తజిల్లాలను తెరపైకితెచ్చారని ఆరోపించారు. జిల్లాల నోటిఫికేషన్ వెలువడిన కొన్నిగంటలకే రియల్ ఎస్టేట్ వ్యాపారంచేసుకొని, ప్రజల్ని దోచుకోండన్నట్లుగా రెచ్చగొడుతూ కొత్త జిల్లా కేంద్రాల్లో భూముల విలువ పెంచుతూ జీవో ఇచ్చారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినవెంటనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల రూపు రేఖలు మారుస్తామని అన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *