50 మంది ఎమ్మెల్యేలకు నో టికెట్.. ఇంతకూ ఎవరా 50 మంది.?
మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ అలర్ట్ అయ్యారు. వచ్చె ఎన్నికల్లొనూ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఇప్పటి నుండే చక్కబెట్టుకుంటున్నారు. ఇందుకోసమే తన పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలపై సీఎం జగన్ గట్టిగా ఫోకస్ పెట్టారు. ఆ 50 మంది ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్ల ఇవ్వబోమని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం వైసీపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఇందులో కీలక అంశాలపై తన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు జగన్. పార్టీ వ్యవహారాల విషయంలో కీలక మార్పులు చేస్తూ ప్రకటన చేశారు.
సర్వే రిపోర్టుల ఆధారంగా పనితీరుపై ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకోవడమే కాకుండా 50 మందికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారని సమాచారం. అయితే అందులో ఎవరనేది స్పష్టత లేదు. సరిగా పని చేయని వారికి ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పారని తెలుస్తోంది. మళ్లీ వచ్చి తనను టికెట్ అడగొద్దని ఖరాకండిగా చెప్పినట్లు సమాచారం. ఇందుకు కారణం చాలామంది ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు.
ప్రతిరోజూ నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తానని జగన్ చెప్పారు. మీ ప్రతి కదలిక నేటి నుంచి నమోదవుతుందని, గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సంపాదించే దిశగా తాను పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తిరగాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టాలని నిర్ధేశించారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ తేల్చి చెప్పారు. అంతేకాకుండా పునర్ వ్యవస్థీకరణలో పదవులు కోల్పోయిన వారంతా పార్టీ కోసం పని చేయాలని ఆదేశించారు