జిల్లాలో ఒక్కరూ లేరా? జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ ఎలా నాశనం చేస్తున్నాడో ఇదిగో ఉదాహరణ అంటున్న జనసేన శ్రేణులు.
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ మంగళగిరి లోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంఘీభావ దీక్షను చేయడం పట్ల పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తమకు పొత్తు ఉన్నప్పటికీ విశాఖ ఉక్కు అంశంపై పవన్ కళ్యాణ్ దశల వారీ పోరాటం చేయడం, తమ పార్టీ నేతలకు ఈ అంశమై పూర్తి స్థాయిలో పోరాడాలని పిలుపివ్వడం గొప్ప విషయంగాచెప్పొచ్చు. కాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఏర్పాటు చేసిన దీక్షా కార్యక్రమంలో అమరావతి రైతులతో సహా పలువురు హాజరై తమ బాధలు చెప్పుకుంటూ దీక్షకు తమవంతు మద్దతు ప్రకటించి వెళ్లారు. ఉదయం నుండి సుదీర్ఘ సమయం జరిగిన ఈ దీక్షలో పవన్ కళ్యాణ్ ఎదుట మాట్లాడే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నాయకులకు దక్కింది. కాని అందులో నెల్లూరు జిల్లా నాయకులు ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడం గమనార్హం. పోనీ నెల్లూరు జిల్లా నుండి దీక్షాస్థలికి నాయకులెవరూ హాజరుకాలేదా అంటే అదీ లేదు. నెల్లూరు నుండి పలువురు నాయకులు, జిల్లాలోని పలు నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు హాజరు కావడం జరిగింది.
జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి సహజం గానే జిల్లాలో ఉండరు. అమెరికాలో తన వ్యాపారాలను నిర్వహించుకుంటూ అడపాదడపా జిల్లాకు వస్తుంటాడు. 2019 ఎన్నికలు పూర్తయిన తర్వాత విదేశాలకు వెళ్లిన మనుక్రాంత్ కేవలం పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సమావేశాలు నిర్వహిస్తుంటే మాత్రం టికెట్ వేసుకుని వచ్చి కనపడేసి వెళ్లిపోతుంటాడు. జనసేన పార్టీ లోని మరో నేత నాదెండ్ల మనోహర్ ఇతనికి పార్టీలో తొమ్మిది పదవుల వరకు ఇప్పించినట్లు, అయినా కానీ ఇతను జిల్లాలో ఉండకుండా విదేశాల్లోనే గడుపుతుంటాడని జనసేన పార్టీ శ్రేణులు సోషల్ మీడియాల వేదికగా బాహాటంగానే విమర్శించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో నాదెండ్ల మనోహర్ వర్గంగా ముద్ర వేసుకున్న మనుక్రాంత్ రెడ్డి కోసం జిల్లాలో పార్టీని నాదెండ్ల మనోహర్ సర్వ నాశనం చేసేస్తున్నాడన్న వ్యాఖ్యలు జనసేన శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం నెల్లూరు విచ్చేసిన మనుక్రాంత్ ఇతర పార్టీల నేతలతో కుమ్మక్కై పలు అక్రమాలకు సైతం పాల్పడ్డారని, కోట్ల రూపాయలు దండుకున్నారని పలువురు బాహాటంగానే ఆరోపించారు. దీంతో 2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల తర్వాత జిల్లాలో ఓట్ల పరంగా మూడో స్థానంలో ఉన్న జనసేన, ఇప్పుడు బీజేపీ, సీపీఎం ల కంటే కూడా తక్కువ ఓట్ల శాతం తెచ్చుకుని దారుణంగా ఓడిపోయి అయిదో స్థానానికి పడిపోయిందని, అసలు ఈ ఎన్నికల పై పూర్తి స్థాయి సమీక్షని పార్టీ అధిష్టానం నిర్వహించి లోపాలు, తప్పులు, అక్రమాలు ఎక్కడ జరిగాయో నిర్ధాలించాలని కానీ కేవలం మనుక్రాంత్ అనే వ్యక్తి నాదెండ్ల మనోహర్ వర్గానికి చెందిన వ్యక్తి కనుకే అలాంటి సమీక్షలు ఏమీ జరగలేదని పలువురు విమర్శిస్తున్నారు.
నేడు మంగళగిరిలో జరిగిన పవన్ కళ్యాణ్ దీక్షా స్థలికి విదేశాల్లో ఉన్నందువల్ల నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి హాజరు కాలేదని, కానీ ఇతర నాయకులు, నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు హాజరయ్యారని, పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చిన పలువురి అభిప్రాయాలను వెళ్ళబుచ్చే అవకాశం ఇచ్చారని, నెల్లూరు జిల్లా నుండి నాయకులే లేరా, ఎందుకు అవకాశం ఇవ్వలేదని పలువురు నెల్లూరు జిల్లా జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో జనసేన పార్టీని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళాలనే బృహత్తర అవకాశం నాదెండ్ల మనోహర్ కి పవన్ కళ్యాణ్ ఇచ్చారని, కానీ నాదెండ్ల తన ఒంటెద్దు పోకడలతో పార్టీని జిల్లాలో సర్వనాశనం చేస్తున్నాడని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు.