ఆ యువ ఎమ్మెల్యేకి మంత్రి పదవి.?

మంత్రి వర్గ విస్తరణలో ఓ యువ ఎమ్మెల్యే చోటు సంపాదించబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ పెద్దల అండదండలు, సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా ఆమెకు మంత్రి పదవి వరించబోతోందని టాక్. ఇంతకీ ఎవరా యువ ఎమ్మెల్యే, ఏ జిల్లా..? వివరాల్లోకి వెళ్తే.. రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం తెలియనివారంటూ ఎవరూ లేరు. రాజకీయ ఉద్దండులను అందించిన నియోజకవర్గంగా చిలకలూరిపేటకు పేరుంది. ఇక్కడ 2019వరకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చక్రం తిప్పారు. 2019 ఎన్నికల్లో గడ్డుకాలం ఎదుర్కొన్న పత్తిపాటి తన శిష్యురాలు విడదల రజినీ చేతిలో ఓటమి చవిచూశారు. జగన్ గాలి వీచడం, పత్తిపాటిపై వ్యతిరేకత పెరగడం విడదల రజనీకి కలిసొచ్చింది.

సాధారణ ఎన్నికల్లో గెలిచిన అనంతరం రజనీ తన గుర్తింపు కోసం తీవ్రం ప్రయత్నాలే చేస్తోంది. సోషల్ మీడియాను సైతం విరివిగా వినియోగించుకుంటోంది. ప్రభుత్వ పథకం, ఇతరత్రా అన్నీ తన పేరుతో ప్రచారం చేసుకుంటుంది కూడా. అయితే ఇటీవల గుండెపోటుతో మరణించిన గౌతంరెడ్డి స్థానంలో విడదల రజనీని భర్తీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. వ్యాపారవేత్త, ఐటీ రంగంపై అవగాహన, వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తనకు అన్ని అవకాశాలు అనుకూలంగా మారుతాయని రజనీ లెక్కలేసుకుంటోందని సమాచారం. ఇదే గనుక జరిగితే జిల్లాలో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే చిన్నవయసులో మంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా పేరు పొందుతారు. అయితే అది అంత ఈజీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

జిల్లాలో సీనియర్లు అయిన అంబటి, పిన్నెల్లి, ఆళ్లను కాదని మంత్రి పదవి ఇచ్చే ఛాన్సే లేదని చెప్తున్నారు. అంతే కాదు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, విడదల రజనీ మధ్య ఆదిపత్య పోరు కూడా నడుస్తోంది. అదే నియోజకవర్గంలో సీనియర్ నాయకులైన మర్రితోనూ ఆమె విభేదాలు ఉన్నాయి. వీరి నుండి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. చూడాలి రజనీ మంత్రి అవుతుందా..వర్గపోరుతో దూరమవుతుందో తెలియాలంటే మంత్రి వర్గ విస్తరణ వరకు ఆగాల్సిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *