నినాదాలకే కేసులు పెట్టడం దిగజారుడుతనం : చంద్రబాబు
నినాదాలకే కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఒంగోలులో 17 మంది మహిళలపై అట్రాసిటీ కేసులను ఆయన ఖండించారు. మహిళానేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమని, మహిళకు భరోసా ఇవ్వాలంటూ మంత్రి కాన్వాయ్ దగ్గర నినాదాలు చేయడం నేరమా? అని ప్రశ్నించారు. మహిళలు నినాదాలు చేయడం నేరం అన్నట్లు కేసులు పెట్టారని, మహిళలపై దాడులను అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. తప్పుడు కేసులతో ప్రభుత్వం గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తోందని, అత్యాచార మహిళ పేరు ఫిర్యాదు కాపీలో రాసి బహిర్గతం చేశారని అన్నారు.
వైసీపీ నేతలు ఇంతకంటే గొప్పగా స్పందిస్తారని అశించడం తప్పేనేమోనని, మహిళలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ టీడీపీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం కోసం సభ్యత్వ నమోదు సక్రమంగా చేయాలని, సభ్యత్వ నమోదు ద్వారా టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతినాయకుడు కార్యకర్త సభ్యత్వ నమోదులో పాల్గొనాలని ఆదేశించారు.
టీడీపీ చేసిన అభివృద్ధి పునాదుల మీదే తెలంగాణ పురోగతి సాధిస్తుందని, నాయకులు ఆఫీసుల్లో కూర్చోవడం కాదు, క్షేత్రస్థాయిలో పర్యటించాలని చురకలు అంటించారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని, కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించాలన్నారు. పార్టీ బలోపేతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అయితే రేపు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో చంద్రబాబు బాదుడే-బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం రచ్చబండ ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. గ్రామస్తులతో కలసి సహపంక్తి భోజనం చేయనున్నారు.