కొంత ఇబ్బంది కలిగినా మహానాడును విజయవంతం : అచ్చెన్నాయుడు

అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా మహానాడును విజయవంతం చేయగలిగామని, మహానాడుకు ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన స్పందన చూసి వళ్లు పులకరించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం ఎంత బెదిరించినా, అధికార పార్టీ నేతలు ఎన్ని హెచ్చరికలు చేసినా లెక్క చేయకుండా విలువైన భూమిని మహానాడు నిర్వహించుకోవడానికి ఇచ్చిన మండువవారిపాలెం రైతులందరికి టీడీపీ తరపున పాదాభివందనాలు. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నా లక్క చేయకుండా జనం తండోపతండాలుగా వచ్చారు.

10 నిమిషాలు ఎండలో నిల్చోవాలంటే ఎంతో కష్టమో తెలిసి కూడా జనం మహానాడు ప్రాంగణానికి వచ్చారు. ప్రైవేటు బస్సు యజమానులకు ఆర్టీవోలు, బ్రేక్ ఇన్స్ పెక్టర్లు ఫోన్లల్లో హెచ్చరికలు చేశారు. ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు జనం తరలివచ్చారు. గత ఇరవై సంవత్సరాల నుండి లారీలపై, ట్రాక్టర్లపై జనం రావడం చూడలేదు. ఎన్టీరామారావు పార్టీ పెట్టినప్పుడు లారీలు, ట్రాక్టర్లు, యడ్లబండ్లపై, కాలినడకతో జనం వచ్చిన సందర్భాలున్నాయి. మహానాడు విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. జిల్లా వాసులకు సెల్యూట్. ఒంగోలు, ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, పరిసర ప్రాంత ప్రజానీకానికి హృదయపూర్వక అభినందనలు.

నాయకులు, కార్యకర్తలు సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకుని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇతర జిల్లావాసులు ప్రకాశం జిల్లావాసులను ఆదర్శంగా తీసుకోవాలి. సంఘటితంగా ఒక మాట మీద నిలబడి, ఒక ఛాలెంజ్ గా తీసుకొని అందరూ పనిచేశారు. మొదటిరోజే లక్షలాదిమంది రావడంతో వారికి మంచినీళ్ల సరఫరా, భోజనం అందించడంలో కాస్త ఇబ్బంది కలిగింది. అన్యదా భావించొద్దు. ఎలక్ర్టానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ చాలా బాగా సహకరించారు.’’ అని అన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *