కేసీఆర్ ను చూసి నేర్చుకో : జగన్ కు లోకేష్ లేఖ

యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి స్వరాష్ట్రానికి చేరుకున్న విద్యార్థుల చదువులు ఆగిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు. విద్యార్థుల విషయంలో ప్రభుత్వంఉదారంగా వ్యవహరించాలని కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్ కు లోకేష్ లేఖ రాశారు. యుద్ద వాతావరణం నెలకొనడంతో ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాల‌కు చేరుకున్నారని, వ‌చ్చిన విద్యార్థుల్లో కొంతమందికి ఇప్పటికే ఆన్‌లైన్‌లో తరగతులను ప్రారంభమయ్యాయని తెలిపారు.

తాము చ‌దివే వ‌ర్సిటీ నుంచి ఎటువంటి స‌మాచారం లేక మరికొందరు అయోమ‌యంలో వున్నారని, త‌మ కోర్సులు పూర్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం విధాన‌ప‌ర‌మైన నిర్ణయం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉందని కోరారు.  ఏపీకి పొరుగునున్న తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్రెయిన్ నుంచి వచ్చిన తమ విద్యార్థుల కోర్సుల పూర్తికి చ‌ర్యలు తీసుకుంటున్నాయని, ఆర్థికంగా అయ్యే ఖ‌ర్చు భ‌రిస్తామ‌ని ప్రకటించాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాగే విద్యార్థులు చ‌దువు పూర్తయ్యే బాధ్యత‌ను తీసుకోవాల‌ని సూచించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన విద్యార్ధులు ఎంబీబీఏస్ అభ్యసించేందుకు అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించిందని, ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలో వైద్య విద్య చదవడానికి కోటి రూపాయాలు ఖర్చు పెట్టాల్సి వస్తే.. ఉక్రెయిన్ లో మాత్రం రూ. 25 నుంచి రూ.30 లక్షల్లోనే ఎంబీబీఎస్ పూర్తి అవుతుందన్నారు. ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి 740 మంది వైద్య విద్యార్ధులు తిరిగి వచ్చారని సీఎం తెలిపారని,  వీరు తమ వైద్య విద్యను కొనసాగించుకునేందుకు వీలుగా అవసరమయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రానికి లేఖ రాస్తామన్నట్లు తెలిపారని లోకేష్ వివరించారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *