అద్దంకి, పర్చూరుపై జగన్ గట్టి ఫోకస్
2019 ఎన్నికల్లో జగన్ హవా రాష్ట్రమంతా కొనసాగింది. అయినా ప్రకాశం జిల్లాలో మాత్రం అనుకున్న స్థాయిలో వైసీపీ టీడీపీని ఢీ కొట్టేలేకపోయింది. జగన్ ప్రభంజనంలోనూ ప్రకాశం జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు టీడీపీకి దక్కాయి. గెలిచిన నలుగురు కూడా బలమైన నేతలే. అయితే నలుగురి ఒకరైన కరణం బలరాం ఏడాది తర్వాత ఫ్యాన్ వంచన చేరారు. దీంతో ఆ బలం మూడుకు చేరింది. గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, డోలా వీరాంజనేయ స్వామి ప్రస్తుతం టీడీపీ తరపున బలంగా పోరాడుతున్నారు. అయితే ఏలూరి, గొట్టిపాటిని వైసీపీలోకి లాగేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి.
ఒకానొక సందర్భంలో ఏలూరి వైసీపీలో చేరిపోతున్నారన్న వదంతులు బలంగా వచ్చాయి. అయినా ఆయన వైసీపీకి నో చెప్పారు. మరొక బలమైన నేత గొట్టిపాటిని వైసీపీలోకి తెచ్చేందుకు జిల్లా వైసీపీ నేతలు గట్టి ప్రయత్నాలే చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని గొట్టిపాటి మాట్లాడినట్లు సమాచారం. అయితే దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇక చివరి అస్త్రంగా గొట్టిపాటి గనులపై రూ.302 కోట్ల ఫినాల్టీని కూడా విధించింది. అయినా తగ్గేదేలే అంటూ గొట్టిపాటి న్యాయ పోరాటం చేసి కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. దీంతో చంద్రబాబు కూడా గొట్టిపాటి, ఏలూరి దైర్య సాహసాలను మెచ్చుకున్నారు.
టీడీపీలోనే ఉంటామని, జిల్లాలో ఈ సారి టీడీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఇరువురు నేతలు పలు బహిరంగ సభల్లో సైతం చెప్పారు. ఇదిలా ఉండగా ఆ ఇద్దరినీ ఓడించేందుకు జగన్ ఫోకస్ పెట్టారు. ఈ సారి గొట్టిపాటిపై కమ్మ సామాజిక వర్గానికి చెందిన బాచిన కృష్ణచైతన్యకు పార్టీ పగ్గాలు ఇచ్చారు జగన్. పర్చూరులో గత ఎన్నికల్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఓటమి చవిచూసిన కారణంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన స్థానంలో ఇంఛార్జ్ గా రామనాథంను వదిలారు జగన్. ఈ ఇద్దరితో గొట్టిపాటి, ఏలూరిని ఓడించాలన్న దృఢ సంకల్పంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.