వివేకా హత్యపై మీరు మౌనం వీడండి..లేదంటే: వర్ల రామయ్య..!

ఎన్నికల్లో గెలిచేందుకు జగనే… వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు పథక రచన చేసి ఉంటారన్న వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాన్ని బట్టి చూస్తే.. వేళ్లన్నీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేకా మర్డర్ కేసులో ఇప్పటికే అన్ని వాంగ్మూలాలు జగన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని వేలెత్తి చూపిస్తున్నా.. ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. మౌనంగా ఎందుకు ఉంటున్నారని, మౌనం నేరాంగీకారమని భావించాలా? అని అభిప్రాయపడ్డారు.

వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది.. ఇప్పటికే 11 సీబీఐ కేసులు ఉన్నాయి.. ఇది 12వది అవుతుందని జగన్ వ్యాఖ్యానించడం చట్టాలంటే లెక్కచేకపోవడమేనన్నారు. హత్యలో తన హస్తం ఉందని జగన్ చెబుతున్నారా? అని ప్రశ్నించారు.  వివేకా ఇంట్లో లేఖ దొరికిన విషయంగానీ, అందులో డ్రైవర్ ప్రసాద్ పేరు ఉన్నట్లుగానీ రాజశేఖర్ రెడ్డి, పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదని, హత్య జరిగిన రోజు జగన్ తన విలేకరుల సమావేశంలో ఆ లేఖ గురించి ఎలా ప్రస్తావించారని ప్రశ్నించారు. వివేకా హత్యను రాజకీయాలతో ముడిపెట్టి జగన్ మాట్లాడటాన్ని బట్టి చూస్తే.. ఈ హత్య గురించి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసని ఆరోపించారు.

వివేకా రక్తచరిత్ర సాక్ష్యాధారాలతో బయటపడిన నేపథ్యంలో నైతిక విలువలతో కూడిన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి భుజస్కందాలపై ఉందని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారని, ఈ రక్త చరిత్ర ఏనాడూ హత్యా రాజకీయాలవైపు కన్నెత్తి చూడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అంటించాలని ప్రయత్నించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఆయనకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *