ఈ బ్లాక్ ఇడ్లీని మీరెప్పుడైనా తిన్నారా… ఎలా చేయాలంటే
ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలానే ఇడ్లీ లను చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సౌత్ ఇండియా ఇది ఫేమస్ టిఫిన్ ఐటమ్. ఐతే మనకు తెలిసిన ఇడ్లీలు తెల్లగా ఉంటాయి. రాగి ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, పాలక్ ఇడ్లీలు కూడా అప్పుడప్పుడూ మార్కెట్లో కనిపిస్తుంటాయి. తెలుపు రంగులో కాకుండా ఆరెంజ్, బ్రౌన్, గ్రీన్ కలర్‌లోనూ తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా బ్లాక్ ఇడ్లీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బాగా పాపులర్ అవుతోంది. ఈ వెరైటీ ఇడ్లీని తినేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఏపీకి చెందిన కుమార్ రెడ్డి కుటుంబం నాగ్‌పూర్ లో సెటిలయింది. అతడు పుట్టింది ఆంధ్రా అయినా… మహారాష్ట్రలోనే పెరిగాడు. దక్షిణ భారత వంటకాలను చేయడంలలో ఈయన దిట్ట. సాధారణంగా ఇడ్లీ సాంబార్, దోశ, ఊతప్పం.. ఈ దక్షిణాది వంటకాలు దేశవ్యాప్తంగా చాలా ఫేమస్. కానీ కుమార్ రెడ్డి మాత్రం ఇడ్లీ తయారీలో ఎక్స్‌పర్ట్. ఇడ్లీల్లో ఎన్నో వెరైటీలు చేస్తారు. దాదాపు 40 రకాల ఇడ్లీలను తయారుచేస్తున్నాడు కుమార్ రెడ్డి. ఐతే ఇలాంటివి చాలా చోట్ల దొరుకుతున్నాయని… ఇంకేదైనా వెరైటీగా చేయాలని ఫ్రెండ్ సూచించాడు. అప్పుడు బ్లాక్ ఇడ్లీ ఐడియా వచ్చింది. ఆ తర్వాత సంప్రదాయ పద్దతిలో ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయకుండా బ్లాక్ ఇడ్లీలను తయారు చేస్తున్నాడు.
ఫుడ్ బ్లాగర్స్ వివేక్, అయేషా ఈ బ్లాక్ ఇడ్లీని వీడియో తీసి ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. వీటి తయారీ కూడా సాధారణ ఇడ్లీలానే ఉంటుంది. సాధారణ ఇడ్లీ పిండికి బొగ్గు పొడిని కలపడం వల్లే ఇడ్లీకి నలుపు రంగు వస్తుంది. కొబ్బరి చిప్పలు, నారింజ పండ్ల తొక్కలు, బీట్ రూట్ గుజ్జును బాగా ఎండబెడతారు. వాటిని మంటలో వేసి కాల్చకుండా.. బాణలిలో బాగా రోస్ట్ చేస్తారు. నలుపు రంగు వచ్చే వరకు వేయిస్తారు. నల్లగా మారిన తర్వాత బయటకు తీసి.. పొడి చేశారు. ఆ చార్ కోల్ పొడినే ఇడ్లీల్లో కలుపుతారు.