నేను ఎవరికీ పోటీ కాదు..నాకు నేనే పోటీ : మాజీ మంత్రి అనిల్
ఎవరితో బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదని, జిల్లాలో వర్గాలు ఉండవు, ఉన్నది ఒకటే వర్గం అది జగన్ వర్గమని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మేం ఎవ్వరైనా గెలిచేది జగన్ బొమ్మతో మాత్రమేనని అన్నారు. నెల్లూరు పట్టణంలో గాంధీబొమ్మ సెంటర్ లో ఆదివారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ…నెల్లూరు ప్రజల ఆశీస్సులతో రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని, ప్రతి ఎన్నికల్లో వైసీపీకి ఘనమైన విజయం అందించారని తెలిపారు. జగన్, నెల్లూరు ప్రజల రుణం ఈ జన్మలో తీర్చుకోలేనన్నారు. తనతో నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
మొదట దఫాలోనే మంత్రి అవుతానని అనుకోలేదని, మంత్రిగా ఉండడం కంటే జగన్ సైనికుడిగా ఉండడమే ఇష్టమని స్పష్టం చేశారు. యుద్ధానికి రాజు తాను నమ్మిన సైన్యాన్నే ముందు పంపిస్తారని, ఇక నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు నెల్లూరు ప్రజలతో ఉంటానన్నారు. 2024లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడతామని నాకేమీ వయసు అయిపోలేదు.. మళ్లీ అవకాశం వస్తుందన్నారు. 730 రోజులు కష్టపడతాం.. మళ్లీ కేబినెట్ లోకి వెళ్తామని స్పష్టం చేశారు.
పదవి లేదని మేం ఎందుకు కుంగిపోతాం, జగన్ కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం.. తగ్గేదేలే అన్నారు. ఇది కేవలం కార్యకర్తల సమావేశమని, మూడేళ్లు తర్వాత కార్యకర్తలతో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నానని అన్నారు. టీడీపీకైనా, సోషల్ మీడియాలో మాట్లాడే చెంచాలకైనా భయపడమని, తనకెప్పుడూ అండగా ఉన్న నెల్లూరు ప్రజల మధ్య ఉంటాని తెలిపారు. తాను ఎవరికీ పోటీ కాదు.. తనకు తానే పోటీ అన్నారు. అయితే నెల్లూరులో జరిగిన కాకాణి, అనిల్ కుమార్ సభలపై దృష్టి పెట్టిన అధిష్టానం, వివాదాలు రాకుండా చూసుకోవాలని హెచ్చిరించింది.