కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు వచ్చా : విజయసాయిరెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ ఆనాడు మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానని ఎంపీ వి.విజయసాయి రెడ్డి అన్నారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న మీ నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన వెంకయ్యనాయుడని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెన్నైలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

సభా కార్యక్రమాలలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చిన కాంగ్రెస్‌ సభ్యులు జైరాం రమేష్‌కు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. రాజ్యసభకు ఎన్నికైన సమయంలో తనకు మార్గదర్శనం చేసిన అకాలీదళ్‌ సభ్యులు గుజ్రాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పనితీరును అభినందిస్తూ తాను అనేక పర్యాయాలు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నిర్మల సీతారామన్‌తో సమావేశమయ్యాన్నారు.

ప్రతి అంశాన్ని ఆమె చాలా శ్రద్ధగా ఆలకిస్తూ వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసే వారని అభినందించారు. టూరిజం, ట్రాన్స్‌పోర్ట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా విశేష ప్రతిభ చూపిన టీజీ వెంకటేష్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలన్నింటిలోకి పని తీరులో ఎప్పుడూ ముందంజలో ఉండే వెంకటేష్‌ కమిటీని అధిగమించడానికి కామర్స్‌ కమిటీ చైర్మన్‌గా తాను తాపత్రయపడుతుండే వాడినని అన్నారు. ఈ సందర్భంగా రిటైర్‌ అవుతున్న సహచర సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక వీడ్కోలు, అభినందనలు చెప్పారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *