ఎంత తీసుకుని వాళ్లకు ఎంపీ సీటు ఇచ్చారు.? : మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే నైజం చంద్రబాబుది అని ధ్వజమెత్తారు. ఓర్వలేని తనంతో చంద్రబాబు జగన్‍ను దూషిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ రాష్ట్రానికి రావడానికి వీల్లేదన్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాంబాబు మాట్లాడుతూ.. ఊసరవెల్లిలా రంగులు మార్చే నేత చంద్రబాబు అని, ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. రాజ్యసభ సీటును జగన్ అమ్ముకున్నారా? అని ప్రశ్నిస్తూ.. చంద్రబాబు హయాంలో టీజీ వెంకటేశ్ కి ఎంతకు ఎంపీ సీటు ఇచ్చారని ప్రశ్నించారు.

ఎంత తీసుకుని సీటిచ్చారో టీజీని అడిగితే చెబుతారని సూచించారు. సుజనా చౌదరి, సి.ఎం.రమేశ్‍కు ఎంతకు ఇచ్చారు? ప్రశ్నిచారు. బీసీ జాతీయ నేతగా గుర్తించి ఆర్.కృష్ణయ్యకు ఇచ్చామని, సీట్లను అమ్ముకునే లక్షణం తమకు లేదని స్పష్టం చేశారు. జగన్‍కు కాదు.. లోకేశ్‍కే లేదు సత్తా లేదన్నారు. జగన్‍కు సత్తా ఉన్నందునే మిమ్మల్ని చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ సింగిల్‍గా గెలవలేని వ్యక్తి చంద్రబాబు అని, కర్నూలుకు వెళ్లి చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని మాట్లాడారు.

కర్నూలుకు న్యాయ రాజధాని రాకుండా మీరు అడ్డుకోలేదా? అని ప్రశ్నించారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టునైనా చంద్రబాబు పూర్తి చేశారా? అని, సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీదే ప్రభంజనం అని, మరోసారి జగన్ దూకుడుతో టీడీపీ కొట్టుకుపోతుందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, తీరు మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *