బందరు వైసీపీలో భగ్గుమన్న విభేధాలు.
ఒకరు మాజీ మంత్రి..మరొకరు ఎంపీ. ఇద్దరూ బడా నేతలే. ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు విభేధాలు భగ్గుమన్నాయి. నేరుగా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో వెళ్లింది వారిద్ధరి మధ్య వివాదం. ఎక్కడ.? ఎప్పుడు.? ఎందుకు.? వివరాలు తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే. మచిలీపట్నం ఎమ్మెల్యేగా మంత్రి పేర్ని నాని, ఎంపీగా వల్లభనేని బాలశౌరి ఉన్నారు. వీరిద్ధరు గెలిచి మూడేళ్లు అయినా ఇప్పటి వరకు వారి మధ్య ఎలాంటి విభేదాలు, తగాదాలు బయటి వరకు రాలేదు. గతంలో ఎలా ఉండేవారో ఎవరికీ తెలీదు. అయితే శుక్రవారం ఏం జరిగిందో ఏమో కానీ బాలశౌరి పర్యటను పేర్ని నాని అనుచరులు అడ్డుకున్నారు.
పార్టీ కోసం పనిచేసినా బాలశౌరి ప్రాధాన్యమివ్వడం లేదంటూ.. పేర్నినాని అనుచరుడు అజ్గర్ వర్గీయుల ఆందోళనకు దిగారు. ఎంపీ బాలశౌరి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తమవడంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ చెప్పారనే బాలశౌరిని గెలిపించామని, ఎంపీ తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యవక్తం చేశారు. సమావేశ మందిరం నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
దీనిపై ఎంపీ వల్లభనేని బాలశౌరి ఘాటుగా స్పందించారు. పేర్నినాని ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోందని, సొంత నియోజకవర్గంలో ఎంపీకి తిరిగే హక్కు లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నేత కొనకళ్లతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పనేంటని, వైసీపీ ఏదారి పడుతోందో ప్రజలకే అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తాను బందురులోనే ఉంటానని, ఎవరేం చేస్తారో చూస్తానని, తాటాకు చప్పుళ్లకు, ఉడుత ఊపులకు భయపడనని హెచ్చరించారు. దీంతో ఈ పంచాయతీ హైకమాండ్ కు చేరింది. రచ్చ రోడ్డెక్కటంతో రంగంలోకి హైకమాండ్ దిగింది. మీడియా ముందు మాట్లాడవద్దని బాలశౌరికి పార్టీ పెద్దలు సూచించారు.