వైసీపీకి అంటీముట్టనట్లుగా మాజీ మంత్రి..ఏం జరిగింది.?
కాళ్లకు పెట్టిన పెళ్లి పారాణి ఆరకముందే ప్రచారానికి వెళ్లిన నేత ఆమె. మూడేళ్లు మంత్రిగా చేసి తన మార్క్ ఏంటో చూపించుకుంది. ఏదైనా వీడియో పెట్టిందంటే వైరల్ అవ్వాల్సిందే. ఇంతకీ ఎవరామె..ఏ పార్టీ.? తెలుసుకుందాం రండి. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గం నుండి వరుసుగా రెండు సార్లు విజయం సాధించారు మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి. గిరిజన కోటాలో ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది. అటు రాష్ట్ర రాజకీయాల్లో, జిల్లాలో దూకుడు పెంచి ముందుకు సాగుతున్న ఆమెకు మంత్రి వర్గం విస్తరణ ముక్కుతాడు వేసినట్లైంది. మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పటి నుండి పుష్పశ్రీవాణి సైలెంట్ అయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా కనిపించేవారు.
అయితే మంత్రి పదవి నుండి తొలగించిన నాటి నుండి ఆ జోష్ కనిపించడం లేదు.మంత్రి పదవిలో కొనసాగించకుండా పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. మొదట కొంచం హుషారుగా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం జరిగారు. అంతేకాదు వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా మొదట అలా ప్రారంభించి ఇప్పుడు పట్టించుకోవడమే మానేశారు. ఇటీవల మంత్రి రాజన్నదొర ఐటీడీఏ, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించగా దానికి సైతం ఆమె గౌర్హాజరు అయ్యారు. అదికూడా కురుపాంలోనే నిర్వహించడంతో ఆమె హాజరుకాకపోవడంతో వైసీపీ వర్గాల్లో కొంత చర్చ మొదలైంది.
మంత్రులు చేపట్టిన సామాజిక బస్సు యాత్రకు కూడా దూరంగా ఉన్నారు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా మంత్రులను ఆమె కలవలేదు. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ ఆమె మాట ఎవరూ లెక్కచేయడం లేదు. తోటి ఎమ్మెల్యేలైన రాజన్నదొర, కళావతి, జోగారావులతో ఆమెకు సఖ్యత లేదు. ఎమ్మెల్యే జోగారావుతో ఆమెకు మొదటి నుండీ గొడవలే. ఇక మంత్రి పదవి నుండి తొలగించే సరికి ఆమె సైలెంట్ అయ్యారు. మన్యం జిల్లాలో ఇంత జరుగుతున్నా అధిష్టానం పట్టించుకోవడం పక్కనపడేసింది. రాజకీయ పరిస్థితులు తెలియవా..తెలిసినా పట్టించుకోలేదా అన్న అన్న సందేశం కలుగుతోంది.