ఫైర్ బ్రాండ్ గానే కొనసాగుతా..శాఖ ముఖ్యం కాదు : మంత్రి రోజా
జబర్దస్త్ షూటింగ్ కు గుడ్ బై చెప్తున్నట్లు టూరిజం శాఖా మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. ఇక షూటింగ్ లలో పాల్గొనబోనని స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయం వద్ద టూరిజం శాఖా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. మంత్రి అయినందుకు షూటింగ్ లు మానేస్తున్నానని తెలిపారు. టీవీ, సినిమా షూటింగ్‌ల్లో ఇక చెయ్యబోనని క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు.
కానీ జగనన్న తనను రెండుసార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రిగా అవకాశమిచ్చారని భావోద్వేగానికి లోనయ్యారు. మహిళ పక్షపాత సీఎం కేబినెట్ లో మహిళ మంత్రిగా ఉండటం అదృష్టంగా భావించు. తనను ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారని, కానీ ఈ రోజు జగనన్న మంత్రిని చేశారంటూ పేర్కొన్నారు. తన ప్రాణమున్నంత వరకు జగన్ కోసం పని చేస్తానని ఉద్ఘాటించారు. అయితే అనంతంర ప్రతిపక్షాలకు మంత్రి రోజా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వంపై అవాకులు, చవాకులు మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు.
ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తానని, తగ్గిదేలే అంటూ పుష్ప డైలాగ్ కొట్టారు. తనలో చిన్నప్పటి నుంచి ఫైర్ ఉందని, ఫ్రైర్ బ్రాండ్‌గానే కొనసాగుతానని, తనకు శాఖ ముఖ్యం కాదు.. బాధ్యత ముఖ్యమన్నారు. పూర్తి సమయం మంత్రి పదవికే కేటాయిస్తానని స్పష్టం చేశారు. మంత్రి పదవి దక్కని వారికి బాధ ఉంటుందని, సామాజిక సమీకరణాల్లో భాగంగానే కొందరికి పదవులు దక్కలేదన్నారు. అసంతృప్తులు సహజమేనని, త్వరలో అన్నీ సమసిపోయి అందరం జగన్ కోసం పనిచేస్తామని తెలిపారు.