ఆయన నిక్ నేమ్ ఏంటో అందరికీ తెలుసు : వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

టీడీపీ శాసనమండలి సభ్యులు పెద్దల సభ పరువు తీస్తున్నారని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆరోపించారు. చర్చకు బదులుగా రచ్చ చేస్తూ సభ్యసమాజం సిగ్గుతో తల దించుకునేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే అంశాన్ని పట్టుకుని వారం రోజుల నుంచి సభ సజావుగా జరగకుండా గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. శాసనమండలిలోకి కొత్తగా 12 మంది సభ్యులు వచ్చారనీ, వారితో పాటు ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నానా యాగీ చేస్తున్నారని నిందించారు. అసలు సారా గురించి మాట్లాడే నైతికత తెలుగుదేశం సభ్యులకు లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఎందుకంటే… నారా చంద్రబాబునాయుడు నిక్‌నేమ్‌ సారా చంద్రబాబు అని లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలి లాబీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మహానుభావుడైన నందమూరి తారకరామారావు విధించిన సంపూర్ణ మధ్య పాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబు… చీప్‌ లిక్కర్‌ సృష్టికర్త చంద్రబాబు… అని ధ్వజమెత్తారు. అటువంటి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్‌ సారా గురించి మాట్లాడడం, నల్ల కండువాలతో శాసనమండలి వేదికగా నిరసన తెలపడం, జే బ్రాండ్లు అంటూ హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

జే అంటే జగన్… జగన్ బ్రాండ్‌ అంటే అభివృద్ధి–సంక్షేమం అని అప్పిరెడ్డి తెలిపారు. జగన్‌ మార్కు పాలన సాగుతున్న రాష్ట్రంలో అమ్మఒడి, విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం పలికిన నాడు–నేడు, వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ, జాతిపిత గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. తెలుగుదేశం హయాంలో స్వయంగా ఎక్సైజ్ మంత్రి జవహర్ బీరు తాగడం మంచిదేనని చేసిన వ్యాఖ్యలను అప్పిరెడ్డి గుర్తు చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *