టీడీపీతో పొత్తుపై పవన్ క్లారిటీ ఇచ్చినట్లేనా.?
వైసీపీ కొమ్ములు విరుస్తాం..ఒక్కటై ఓడిస్తాం..వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకమవ్వాలి..ప్రభుత్వం ఓటు చీలనివ్వను..జగన్ సర్కారును గద్దె దింపేందుకు బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నా..రాష్ట్రంలో సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. అయితే ఇదే వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. నిన్నమొన్నటి వరకూ టీడీపీ-జనసేన మధ్య పొత్తు పొడుస్తుందని ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే దీనికి ఆవిర్భావ సభలో పవన్ మాటలను బట్టి శుభంకార్డు పడింది.
వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవ్వాలి, ప్రజాక్షేమం కోసం పొత్తులపై ఆలోచిస్తామని చెప్పిన ఒక్కమాట ఇక టీడీపీతో జతకట్టేందుకు ఇచ్చిన సంకేతంగా కనబడిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలు బహిరంగంగా ప్రకటించుకోకపోయిన క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టిగా పోరాడి మంచి ఫలితాలనే రాబట్టారు. అంతేకాదు పవన్, చంద్రబాబు తమను కలిసి పనిచేయాలని ఆదేశించి ఉంటే ఫలితాలు మరోలా వుండేవని జనసేన నేతలు కూడా టీవీ చర్చల్లో చెప్పారు. పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించగలమన్న ధీమాను ఇరు పార్టీల సీనియర్ నేతలు భావిస్తున్నారు.
ఇది ఇద్దరు అధినేతల వద్ద ప్రస్తావించడానికి పార్టీ నేతలు సాహసించడం లేదు. ఇప్పుడు ఏకంగా పవన్ వైసీపీకి వ్యతిరేక శక్తులు ఏకమవ్వాలన్న పిలుపుతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఖాయమన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే పవన్ బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. టీడీపీ అంటే బీజేపీకి పడదు. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పెట్టాయి. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా.? లేక బీజేపీని వదిలి టీడీపీతో పవన్ చేతులు కలుపుతారా అన్న సందేహం వ్యవక్తమవుతోంది. ఇక పవన్ విమర్శలపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. చంద్రబాబును మళ్లీ సీఎం చేసేందుకు పవన్ తాపత్రయపడుతున్నారని, జనసైనికులు టీడీపీ పల్లకీ మోయడానికి సిద్ధంగా ఉండాలని కౌంటర్ ఇస్తున్నారు.