మృతదేహానికి కొవిడ్ పరీక్షలు.. 41 రోజుల్లో 28 సార్లు పాజిటివ్!
ప్రపంచం వ్యాప్తంగా కొవిడ్ చేసిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. వరుస వేరియంట్లతో కరోనా వైరస్ ప్రజల పై ప్రభావం చూపుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ పూర్తి స్థాయిలో తగ్గలేదు. దీనిని రూపుమాపేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వివిధ వైద్య, ఔషధ సంస్థలు భారీ స్థాయిలోనే పరిశోధనలు చేపట్టాయి. అయితే ఇప్పటికీ అంతపట్టని విషయాల్లో ఒకటి ఏంటంటే..? కొవిడ్ మనిషి శరీరంలో ఎంత కాలం ఉంటుంది? చనిపోయిన తరువాత కూడా వైరస్ అలానే ఉంటుందా? చనిపోయన వ్యక్తితోనే అంతం అవుతుందా? ఇలా చాలా ఉన్నాయి. వీటి మీద పరిశోధన ఇంకా జరుగుతూనే ఉంది.
అయితే ఇటీవల ఓ వ్యక్తి చనిపోయిన తరువాత అతని మృతదేహంలో కరోనా వైరస్ ఏకంగా 41 రోజులు ఉందని పరిశోధకులు తేల్చారు. అయితే ప్రతీ ఒక్కరి శరీరంలో ఇలానే 41 రోజుల పాటు ఉంటుందా అని అంటే సరైన సమాధానం చెప్పలేము అని అంటున్నారు పరిశోధకులు. వ్యక్తి ని బట్టి ఇది మారొచ్చని చెప్తున్నారు. అయితే ఈ వ్యక్తిలో మాత్రం 41 రోజులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆ మృతదేహానికి పరిశోధకులు ఏకంగా 29 సార్లు కొవిడ్ టెస్ట్ చేశారు. చేసిన ప్రతీ సారి పాజిటివ్ అని రావడం గమనార్హం. అయితే చివరిగా 29 వ సారి నెగటివ్ వచ్చింది.
మృతదేహానికి పరీక్ష ఎందుకు చేశారు అనే డౌట్ మీకు రావచ్చు. ఇటలీకి చెందిన ఓ వ్యక్తి.. సముద్ర స్నానానికి అని వెళ్లాడు. అయితే అక్కడే అతను చనిపోయాడు. దీనిని గుర్తించిన కోస్టుగార్డులు మృతదేహాన్ని స్థానికంగా ఉండే అధికారులకు అప్పగించారు. అయితే ఆ వ్యక్తిని బంధులకు అప్పగించాలంటే కొవిడ్ పరీక్ష చేయాలి అని ఇటలీ చట్టాలు చెప్తున్నాయి. దీంతో కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. అందుకే అలానే ఆ మృతదేహాన్ని వారి దగ్గరే ఉంచున్నారు. ఇలా సుమారు 29 సార్లు చేయగా..చివరకు 29వ సారి నెగటివ్ వచ్చింది. దీని బట్టి వ్యక్తి శరీరంలో కొవిడ్ 41 రోజుల వరకు ఉండొచ్చని నిర్ధారణకు వచ్చారు పరిశోధకులు. సరైన సమాధానం రావాలి అంటే ఇంకా దీనిపై పరిశోధన విస్తృతం చేయాలని అంటున్నారు.