టీడీపీతో వస్తారేమోనని ఆయనపై విమర్శలు : బుద్ధా వెంకన్న
జగన్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయని, ఏపీలో పరిస్థితులపై కేటీఆర్ వ్యాఖ్యలు నిజమేనని తెలిపారు. విజయవాడలోని తన కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. అన్ని ధరలూ పెంచి ప్రజలపై జగన్ భారం మోపారని ఆరోపించారు. ఏపీలో పరిస్థితులు చూడటానికి సరిహద్దు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. హామీలు నెరవేర్చనందుకు జగన్ పై సుమోటోగా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పవన్ టీడీపీతో వస్తారేమోనని ఆయనపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇంతవరకు పొత్తుల అంశమే తమ వద్దకు రాలేదు అని అన్నారు. జరుగుతున్నవి ప్రచరాలే.. అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయమే ఫైనల్ అని కొట్టి పడేశారు. చంద్రబాబు ఎవరికి బీఫామ్ ఇస్తే వారే గెలుస్తారు అని పేర్కొన్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని, ఓనమాలు తెలియని వారికి హోంశాఖ ఇచ్చారని విమర్శించారు. మంత్రులు ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నారని మండిపడ్డారు. జగన్ ను కూడా విజయసాయి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
సరైన పదవి ఇవ్వకపోతే అప్రూవర్ గా మారతానని సీఎం జగన్ ను విజయసాయి బెదిరిస్తున్నారని తెలిపారు. అందువల్లే విజయసాయికి పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతను అప్పగించారని అన్నారు. జగన్ అనుచరులు విశాఖను నాశనం చేయడంతో ఉత్తరాంధ్ర వ్యాపారులు హైదరాబాద్ వెళ్లిపోయారుని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు టీడీపీదే అని స్పష్టం చేశారు. ప్రజలను వైసీపీ అష్టకష్టాలకు గురి చేసిందని, ప్రజల చేతిలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బడితపూజ తప్పదు అని హెచ్చరించారు.