మాలో ఎదురుదాడి, ఊపు తగ్గదు : మాజీమంత్రి అనిల్
తొలి కాబినెట్లో బీసీ అయిన తనకు మంత్రిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బీసీ అయిన తనకు ఇరిగేషన్ శాఖ కేటాయించారని గుర్తు చేశారు. చెప్పిన సమయం కన్నా ఎక్కువ కాలం మంత్రిగా కొనసాగించారని అన్నారు. నెల్లూరులో మంగళవారం మీడియాతో మాట్లాడారు. కొత్తగా మంత్రి పదవులు తీసుకున్న వారికి అభినందనలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో కొత్తచరిత్రకు శ్రీకారం చుట్టిన గొప్పవ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. జగన్ మోహన్ రెడ్డి రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని, సీఎం వైఎస్ జగన్ కి సేవకుడిలా , సైనికుడిలా బతికినంతకాలం పని చేస్తానని స్పష్టం చేశారు.
ఎవరెన్ని వార్తలు రాసినా తగ్గేదెలా అంటూ పుష్ప డైలాగ్ కొట్టారు. సీఎం వైఎస్ జగన్ జోలికొస్తే డబల్ బనోంజా ఇస్తామని, తమ వాయిస్ లో కానీ, ప్రతిపక్షాలపై ఎదురుదాడిలో కానీ ఊపు, జోరు తగ్గదని హెచ్చరించారు. 2024లో మళ్ళీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే వస్తుందని జోష్యం చెప్పారు. మళ్ళీ తమకు మంత్రులుగా అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రిగా పనిచేసిన సమయంలో తనకు సహకరించిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా వచ్చేవారం నుంచి ప్రజాబాట ప్రారంభిస్తామని తెలిపారు.
మూడేళ్ళలో నెల్లూరు సిటీలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. మంత్రిమండలిపై యనమల వ్యాఖ్యలు బీసీ,ఎస్టీ ,ఎస్సీ ,మైనారిటీలను అవమాన పరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థులతోనే కాబినెట్ విస్తరణ జరిగిందని, సీఎం వైఎస్ జగన్ నిర్దేశిస్తే తాను ఆచరిస్తానన్నారు. పవన్ కళ్యాణ్ 140 సీట్లకు పోటీ చేసిన రోజు తాను మాట్లాడతానని, పవన్ బీమ్లా నాయక్ కాదు..టీడీపీ ఇచ్చే సీట్లు ముష్టిగా తీసుకొనే బిక్షం నాయక్ అని ఎద్దేవా చేశారు.