ఏపీ జెన్‌కోని అదానీ జెన్కోగా మార్చే కుట్ర : పట్టాభి
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొద్దిరోజుల క్రితం తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ‘‘తమ పరిపాలన అద్భుతంగా ఉందని, ప్రజలు అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో 175 కు 175 సీట్లలో విజయం సాధిస్తా’’ మని ధీమా వ్యక్తం చేసిన సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు వివిధ రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఆయన దృష్టికి తెచ్చారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. ‘‘కేంద్ర విద్యుత్ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటి అథారిటీవారు ప్రతినెల విద్యుత్ రంగంపై విడుదల చేసే నివేదిక మనం పరిశీలించినట్లయితే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
వారు విడుదల చేసిన లేటెస్ట్ రిపోర్ట్ (ఏప్రిల్ 2022) మనం గమనించినట్లయితే… దక్షిణాది రాష్ట్రాల్లో అన్నింటికంటే అత్యధికంగా మన రాష్ట్రం డిమాండ్ ఉన్న విద్యుత్ లో 382 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయలేకపోయినట్లు స్పష్టమౌతోంది. ఇతర దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణలో కేవలం 18 MU, కర్నాటకలో 18 MU, కేరళలో 12 MU, తమిళనాడులో 67 MU, పాండిచ్చేరిలో 1 MU మాత్రమే విద్యుత్ కొరత ఉన్నట్లు స్పష్టమౌతోంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏస్థాయిలో ఉందో ముఖ్యమంత్రిగారు విద్యుత్ రంగంపై చేసిన వ్యాఖ్యలలో ఎంత నిజముందో అర్థమౌతోంది.
రాష్ట్రంలో ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని విద్యుత్ ప్లాంట్లను కుట్రపూరితంగా నిర్వీర్యం చేస్తూ వాటిని ప్రైవేటుపరం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఏపీ జెన్కోను పూర్తిగా అదాని జెన్కోగా మార్చి రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థ మొత్తాన్ని అదానీలకు కట్టబెట్టాలని చూస్తోంది జగన్ సర్కార్. నిన్నటి వరకు పోర్టులను ధారాదత్తం చేసి నేడు విద్యుత్ ప్లాంట్లను కూడా కట్టబెట్టాలని చూస్తోంది. ఈ ప్రక్రియలో ముందుగా కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ ను ఎంచుకుంది జగన్ సర్కార్. నేటి ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి వల్ల దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ లోని 16వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయే పరిస్థితికి చేరింది’’ అని ఆరోపించారు