తెలంగాణలో కాంగ్రెస్ పక్కా ప్లాన్..వ్యూహరచన ఎవరితోనంటే..
తెలంగాణలో టీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలో తలమునకలైపోతోంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడాక ఈ సారి చావోరేవో అన్న చందంగా సీనీయర్లు ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ అధికారాన్ని అనుభవిస్తూ బలంగా ఉన్న విషయం తెలిసిందే. మూడో పర్యాయం కూడా గెలుపు బాట పట్టేందుకు ఎన్నికల వ్యూహకర్త పీకే సేవలను తీసుకోవాలన్న ప్రణాళికలో టీఆర్ఎస్ ఉంది. ఇప్పటికే పీకేతో ఈ విషయమై టీఆర్ఎస్ అగ్రనేతలు చర్చలు కూడా నిర్వహించారన్న సమాచారం బట్టబయలైంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో సైతం దూకుడుగా వెళుతోంది. కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ, ఆందోళన చేపడుతోంది. ఇప్పటికే రెండు ఉపఎన్నికల్లో గెలిచిన ఉత్తేజంలో ఉంది బీజేపీ. తద్వారా తెలంగాణలో జెండాను మరింత బలంగా నాటాలన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది. దీంతో ఇరు పార్టీలను ఎదుర్కొని అధికారం సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది.
ఇందులో భాగంగా ప్రశాంత్ కిషోర్ మాజీ సహచరుడు వ్యూహకర్త సునీల్ సేవలను ఉపయోగించుకునే ప్రతిపాదనపై ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రతినిధులు ఇప్పటికే సునీల్ కనుగోలుకు చెందిన ‘మైండ్ షేర్ అనలైటిక్స్’తో ఢిల్లీలో ఒక దఫా చర్చలు నిర్వహించినట్టు తెలిపాయి. త్వరలోనే ఒప్పందం కుదరొచ్చని వెల్లడించాయి.తెలంగాణలో కనీసం 90 సీట్లలో అయినా గెలవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాయి.
సునీల్ కనుగోలు 2014లో సార్వత్రిక ఎన్నికల్లో పీకే బృందం సభ్యుడిగా నరేంద్ర మోదీ గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత పీకే టీమ్ నుంచి వేరు పడి బీజేపీకి సేవలు అందిస్తున్నారు. అయితే ఇంటిపోరుతో అతలాకుతలమవుతున్న కాంగ్రెస్ కు ఈ సారైనా అధికారం దక్కుతుందేమో వేచి చూడాలి.