నెల్లూరు వైసీపీలో బయటపడ్డ విభేధాలు
నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట లాంటిది. వైసీపీ ఆవిర్భావం నుండి ఆ జిల్లాలో వైసీపీ ప్రభంజనమే కొనసాగుతూ వస్తోంద. అయితే ఇప్పుడు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నెల్లూరు వైసీపీలో ముసలానికి ఆజ్యం పోసింది. ఆదివారం మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వేరువేరుగా బహిరంగ సభలను నిర్వహించారు. కానీ ఇద్దరూ ఒకే రోజు నిర్వహించడం, అదికూడా అనిల్ నిర్వహించిన సభలో మిగతా నాయకులెవరూ లేకపోవడాన్ని విబేధాలను చూపిస్తోంది. ఓ వైపు ఎవరికీ పోటీ కాదనే చెప్తూనే..కాకాణి గోవర్థన్ రెడ్డి వర్గీయులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను అనిల్ వర్గం చించిపడేసింది.
దీనికి చిన్నకారణాలేవీ లేవు. గతంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనిల్ ను సర్వేపల్లి, వెంకటగిరిలో అడుగు పెట్టనివ్వలేదు కాకాణి గోవర్థన్, ఆనం రామనారాయణ రెడ్డి. అప్పటి నుండి వారి మధ్య ఆదిపత్య పోరుకు నాంది పలికింది. ఇటీవల మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత కూడా అనిల్ కొందరు నాకు బాగా సహకరించారు..నా మీద ఎంత ప్రేమ చూపించారు అంత ప్రేమను నేను కూడా చూపిస్తానని మీడియా ముఖంగా బహిరంగంగా విమర్శించడం చూస్తే అవి కాకాణిని ఉద్దేశించి మాట్లాడినట్లుగా స్పష్టమైంది. అంతేకాదు ఆదివారం నిర్వహించిన సభకు జిల్లా పెద్దలెవరూ హాజరు కాలేదు.
కాకాణి సభకు మాత్రం అంతా హాజరయ్యారు. అంతేకాదు ఈ సభలో అనిల్ కుమార్ ను ఉద్దేశించి ఆనం మాట్లాడినట్లుగా స్పష్టమైంది. నెల్లూరు జిల్లాలో మూడేళ్లుగా అభివృద్ధి లేదని, నీటి ప్రాజెక్టు పనులు ఒక్కటి కూడా ముందుకు సాగలేదని మాట్లాడిన మాటలు అనిల్ కుమార్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడినట్లుగా స్పష్టంగా కనబడుతోంది. ఇదిలా ఉండగా టీడీపీకి, సోషల్ మీడియాలో వాగే వారికి హెచ్చరిస్తున్నా అంటూ అనిల్ మాట్లాడిన మాటలు తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైసీపీ నేతలు మాట్లాడిన దానికి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇంతటితో ఆగుతుందా…ముదిరిపాకాన పడుతుందా అన్నది చూడాలి మరి