సీఎం జగన్ మహిళా పక్షపాతి : మంత్రి కాకాణి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని,  మహిళా సాధికారత కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం వెంకటాచలం మండలంలో  వైయస్ఆర్ సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ… మహిళలకు చేదోడువాదోడుగా ఉంటూ మహిళల సాధికారత కోసం వైయస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, అమ్మ ఒడి,తోడు వంటి అనేక పథకాలను జగన్ అమలు చేస్తున్నారన్నారు.  కుటుంబంలో ఆర్థిక క్రమశిక్షణ మహిళలకే సాధ్యమని గుర్తించి ప్రతి పథకం వారి పేరిటనే ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు.

గత ప్రభుత్వం  మహిళల రుణ మాఫీ చేస్తామని చెప్పి కూడా చేయలేదన్నారు. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి ఉన్న రుణ బకాయిలు నాలుగు విడతలుగా తిరిగి చెల్లిస్తామని చెప్పిన ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో తిరిగి జమ చేస్తున్నామన్నారు. అలాగే వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఎవరైతే మహిళలు క్రమశిక్షణగా సకాలంలో మూడు లక్షల రూపాయలు లోపు అప్పు తీసుకుని తిరిగి చెల్లించిన వారందరికీ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

తమ ప్రభుత్వం వచ్చాక ఈ మూడు సంవత్సరాల కాలంలో 26,98,822 స్వయం సహాయక సంఘాల లోని 2,79,09,521 మంది సభ్యులకు రూ.3,616 కోట్ల సున్నా వడ్డీ కింద అందించడం జరిగిందన్నారు.జిల్లాలో 1,23,441 సంఘాలకు చెందిన 12,68,355  మంది మహిళలకు రూ.196 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు  నూతన మంత్రివర్గంలో తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత గానే ఉంటానన్నారు. తాను ఎమ్మెల్యే అయినా ఇప్పుడు మంత్రి నయినా తన నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో బిడ్డగా తోబుట్టువుగా భావించి వారి సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *