చంద్రబాబు పచ్చి మోసగాడు : మంత్రి అంబటి రాంబాబు
రామోజీ, ఎల్లో మీడియా ఆరాటమే తప్ప.. రాజకీయంగా చంద్రబాబు బతకడని నీటి పారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎత్తిపోతున్నాయ్.. అంటూ ఈనాడు విషం చిమ్ముతోందని, జూన్ లోనే నీళ్ళు ఇస్తుంటే రామోజీకి కనిపించదా అని ప్రశ్నించారు. తాడేపల్లి బుధవారం మీడియాతో మాట్లాడారు. డోనేకల్లు లిఫ్టు పథకం 1989లో ప్రారంభించి, అదే ఏడాది మూతపడితే దానికి జగన్ ఎలా కారణమవుతారని ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో, అంతకుముందు మూలనపడిన ప్రాజెక్టులన్నింటికీ జగన్ కారణమా రామోజీ అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లాలో ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా ఉందన్న ఈనాడు రాతలు పచ్చి అబద్ధాలు, ఇది రామోజీ అబద్ధమని కొట్టిపారేశారు. ఈనాడు, ఎల్లో మీడియా అబద్ధాలు రాసినంత మాత్రాన.. ప్రజలు జగన్ కి దూరం కారని స్పష్టం చేశారు.
ఎవర్నో అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తున్న ఎల్లో మీడియా ప్రజలకు దూరమవుతోందని మండిపడ్డారు.
రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు సమీకరించి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచిందని, మన రాష్ట్రంలో 34 శాతం జీడీపీ వ్యవసాయం మీదే ఆధారపడి ఉందన్నారు. దానికి తగ్గట్టుగా వ్యవసాయాన్ని ఎంత అభివృద్ధి చేస్తే అంత బ్రహ్మాండంగా రాష్ట్రానికి ఫలితాలు వస్తాయని నమ్మిన ప్రభుత్వం తమదన్నారు. తమది రైతు ప్రభుత్వం అని, ఇందుకు సంబంధించి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాలను ఈ నెల 19వ తేదీలోగా పూర్తి చేయాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయన్నారు.
పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి డయాఫ్రం వాల్ దెబ్బతినడం వల్ల పనులు కొద్దిగా కుంటుపడిన మాట వాస్తవమేనని, డయాఫ్రం వాల్‌ను ఏవిధంగా నిర్మించాలనే దానిపైనా, మరోవైపు వరద ఉద్ధృతి వల్ల డయాఫ్రం వాల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటం, వాటిని సరిచేయాల్సిన అనివార్య పరిస్థితి రావడం విచారకరం అని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల వల్లే ఇదంతా జరిగిందని, దీనిపై జలశక్తి అడ్వైజర్ శ్రీరామ్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈఎన్సీ, సీడబ్ల్యూసీకి సంబంధించిన నిపుణులు చర్చలు జరుపుతున్నారని వివరించారు.