మంత్రి బుగ్గనపై పోటీ చేసే అభ్యర్థని ప్రకటించిన చంద్రబాబు
నేను ప్రజల్లో చైతన్యం కోసం వస్తే ప్రజలే ముందుండి నన్ను స్వాగతిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ బాదుడే బాదుడుతో ప్రజలెవరూ ఆనందంగా లేరని పేర్కొన్నారు. డోన్ లో గురువారం బాదుడే-బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి పనికి మాలిన దద్దమ్మ సీఎంను చూడలేదన్నారు. కర్నూలు ప్రజలు పక్క రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లి పెట్రోల్ తెచ్చుకుంటున్నారని, ఏపీ ప్రజల డబ్బులు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జగన్ సాధించిన విజయం అని, రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే నవగ్రహాల చుట్టూ తిరగాలన్నారు.
డ్రగ్స్, గంజాయికి ఏపీ కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఉద్యోగులు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. చెత్తకు పన్ను వేసే చెత్త ముఖ్యమంత్రి. మూడేళ్లయినా టిడ్కో ఇళ్లను ఇవ్వకుండా ప్రజలను వేధిస్తున్నారు. టీడీపీ చొరవ, ఫౌండేషన్ వల్లే హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో ఉంది. ఆ ఫలాలను తెలంగాణ వారు అనుభవిస్తున్నారు. బీసీలకు టీడీపీ వెన్నుముక.. టీడీపీ అంటేనే బీసీల పార్టీ. జగన్ అడుగడుగునా తప్పులు చేస్తూ.. మళ్లీ సమర్థించుకుంటాడు.
బాబాయిది గొడ్డలి పోటా లేక గుండె పోటా? బుగ్గన ఆర్థిక మంత్రి కాదు.. అప్పుల మంత్రి. బుగ్గన నీ ఆటలు ఇక సాగవు.. బులెట్ చేసి బరిలో వదిలా అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ధర్మారం సుబ్బారెడ్డి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. అభ్యర్థిని మారుస్తారన్న ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. అందరూ కలసి కట్టుగా పనిచేసి సుబ్బారెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.