వచ్చేనెల 11న మంత్రివర్గ విస్తరణ..ఉండేదెవరు..ఊడేదెవరు.?
ఏపీ మంత్రివర్గ విస్తరణకు సీఎం జగన్ ముహూర్తం సిద్ధం చేశారన్న ప్రచారం ఊపందుకుంది. అది కూడా వచ్చేనెల ఏప్రిల్ 11న కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. కొత్త మంత్రుల ఎంపిక విషయంలో ఏ విధమైన పొరపాట్లూ లేకుండా రాజకీయంగా, ప్రాంతీయంగా, సామాజికవర్గ పరంగా కూడా పూర్తి స్థాయిలో ఒకటికి పదిసార్లు సమీక్షించుకుని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇక కొత్త మంత్రులుగా ఎవరు ఉండాలన్నది సీఎం ఇష్టమే అయినా ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండడంతో ముఖ్యమంత్రికి ఇది కత్తి మీద సాము వ్యవహారమే అని అంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఉండేదెవరు..ఊడేదెవరు అన్న ఊహాగానాలు రేకెత్తున్నాయి. అందరినీ తొలగిస్తారా..లేదా కొందరిని ఉంచుతారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది.
ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోయాలంటే పాతవారిలో కొందరిని కొనసాగిస్తేనే మంచిదన్న అభిప్రాయం వెల్లడవుతోంది. ఈ లిస్టులో మంత్రి కొడాలి నాని, పెద్దిరెడ్డి, పేర్ని మంత్రి పదవి కిందకు నీళ్లు రాకపోవచ్చని తెలుస్తోంది. చంద్రబాబును చెండాలంటే కొడాలి, పవన్ ను విమర్శించాలంటే పేర్ని ఉంచుతారని, మిగతావారందరినీ పక్కన పెట్టేస్తారని సమాచారం. ఆశావాహుల్లో మహిళల నుండి రోజా, విడదల రజనీ, జొన్నలగడ్డ పద్మావతి ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దల ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికి పదవి అందే అవకాశం ఉంది.
పదవుల నుండి తొలగించిన వారు వచ్చే ఎన్నికల్లో తిగిరి గెలిచేందుకు కృషి చేయాలనీ, ఎవరికి పదవి ఇచ్చినా.. ఎవరిని తప్పించినా పార్టీ కోసమేనని, పదవుల నుండి తప్పించిన వారిని జిల్లాల పరిశీలకులు ఉంటారని జగన్ ఇది వరకే చెప్పారు కూడా. అప్పగించిన పనిని పార్టీ కోసం ప్రతి ఒక్కరూ పని చేయాల్సిదేనని అల్టిమేటం జారీ చేశారు. ఎవరు మంత్రులు కాబోతున్నారు..ఎవరు మాజీలు కాబోతున్నారో చూడాలంటే ఏప్రిల్ 11 వరకు ఆగాల్సిందే.