వరుడి విగ్గు ఊడింది.. పెళ్లి క్యాన్సిల్ అయింది..!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన విచిత్ర సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఉన్నావ్‌కు చెందిన యువకుడితో సమీప గ్రామంలోనే యువతితో పెళ్లి కుదిర్చారు పెద్దలు. కొన్ని రోజులుగా పెళ్లికి సంబంధించిన ప్రక్రియనూ రెండు కుటుంబాల వాళ్లు పూర్తి చేశారు. బంధువులందర్నీ పిలిచారు. పిలిచిన వారంతా వచ్చారు.ఆదివారం పెళ్లికి అంతా రెడీ అయ్యారు. తాళి కట్టే ముందు జరగాల్సిన తంతు మొత్తం పూర్తైంది.
పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో వరుడు పెళ్లి మండపం వద్దకు నడుస్తున్నాడు.అయితే, అలసిపోయి పెళ్లి కొడుకు స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో అతడిని లేపేందుకు పెళ్లికూతురు సోదరుడు ముఖంపై నీళ్లు చల్లి, తలపాగా తీయబోయాడు. అదే సమయంలో వరుడి విగ్గు ఊడిపోయింది. అది చూసిపెళ్లి కూతురు సహా బంధువులు అంతా షాకయ్యారు. పెళ్లి కొడుకుకి బట్టతల ఉందని తమకు ముందుగా ఎందుకు చెప్పలేదని, ఇంత మోసం చేస్తారా? అంటూ నిలదీశారు. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని పెళ్లికూతురు స్పష్టం చేసింది. దీంతో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
చివరికి ఈ పంచాయితీ పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు జోక్యం చేసుకుని రెండు కుటుంబాలను కూర్చోబెట్టి సెటిల్ చేశారు. వధువు తరఫున బంధువులు పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోవడంతో చేసేది లేక క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. వరుడి తల్లిదండ్రుల నుంచి రూ.6 లక్షలు డిమాండ్ చేశారు వధువు తండ్రి.. పోలీసులు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేలా వరుడి కుటుంబాన్ని ఒప్పించారు. మూర్చ వ్యాధితో పాటు వరుడికి బట్టతల ఉన్న విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేస్తున్నారని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం ముందే చెప్పి ఉంటే తమ అమ్మాయిని మానసికంగా సిద్ధం చేసే వాళ్లమని, ఇలా మోసం చేసి చేయడంతో ఆమెకు సహించడం లేదని బంధువులు చెప్తున్నారు.