ఐశ్వర్య రాయ్ కి నోటీసులు జారీ చేసిన ఈడీ… ఏ కేసులో అంటే
బాలీవుడ్‌లో ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనలు కలకలాన్నిరేపుతున్నాయి. హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. పనామా పేపర్ లీక్ కేసులో తమ ముందు హాజరు కావాలని నోటీసులు అందించారు. ఈ మేరకు నేడు ఢిల్లీ లోని లోక్ నాయక్ భవన్‌లో తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పనామా లీక్ కేసులో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌పై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. కాగా మనీ లాండరింగ్ కేసులో హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహిలను ఇప్పటికే ఈడీ విచారిస్తోంది. ఇప్పుడు తాజాగా ఈడీ ఐశ్వర్యరాయ్‌కు నోటీసులు పంపడం పట్ల బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పేరొందిన ప్రముఖులు పన్నులు కట్టకుండా విదేశీ బ్యాంకుల్లో దాచిన ఖాతాల వివరాలు బయటకొచ్చాయి. ‘పనామా పత్రాలు’ పేరిట అప్పట్లో వెలుగులోకి రావడం సంచలనం రేపింది. పనామా దేశానికి చెందిన మొసాక్ ఫోన్సెకా అనే కార్పొరేట్ సంస్థ వేలాది సూట్‌కేసుల కంపెనీ బాగోతాలు బయటపెట్టింది. 2016 లో బయటపడ్డ పనామా పేపర్స్ లీకేజీతో పలువురు ప్రముఖులపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. వివిధ దేశాల రాజకీయ నాయకులు, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు, ఇతర సెలబ్రిటీల మనీ లాండరింగ్ వ్యవహారాలు పనామా పేపర్స్ లీక్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. మన దేశం లోనూ పనామా లీక్స్ ప్రకంపనలు రేపగా… ఈడీ ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.