భీమ్లా అభిమానులకు మరో గుడ్ న్యూస్.. నాలుగు రోజులు ముందుగానే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు అభిమానులను నిరాశకు గురిచేసిన చిత్ర యూనిట్… ఇటీవల విడుదల తేదీని ప్రకటించింది. వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా? అంటూ పవన్ అభిమానులు ఆరాటపడుతున్నారు. వారికి చిత్ర బృందం నుంచి మరో తీపి కబురు అందనుంది.
ఈనెల 25 న భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సరిగ్గా నాలుగు రోజుల ముందుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ లైన్స్ లో ఈ వేడక జరుపనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించిన అనుమతుల కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే ఈ వేడుకకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ మరో రెండు రోజుల్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
సినిమా రిలీజ్ కు నాలుగు రోజుల ముందే పవన్ ను వేదికపై చూడడం నిజానికి ప్రేక్షకులకు పండగే. విభిన్నమైన కథాంశం, పవర్ ఫుల్ నటులైన పవర్ స్టార్ పవన్, భల్లాలదేవ రానా నటించిన ఈ చిత్రం రోజురోజుకూ అంచనాలు పెంచుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు సాగర్ కే ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు రాస్తుండగా.. మ్యూజిక్ మ్యాజిక్ థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.