నా కొడుకును కూడా టచ్ చేశారు.. వదలను: బెల్లంకొండ సురేశ్
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్, అతని తనయుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సినిమా తీయడానికి డబ్బులు అవసరమంటూ తన దగ్గర నుంచి రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ ఇష్యూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చీటింగ్ కేసుపై బెల్లంకొండ సురేశ్ స్పందించారు. తనను, తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగంగా చీటింగ్ కేసు నమోదైందని ఆయన ఆరోపించారు. శరణ్ తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు.
‘కొంతమంది కావాలనే నాపై, నా కొడుకుపై కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శరణ్ నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి. శరణ్‌తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారు . నాకు డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టక పోతే పరువునష్ట దావా వేస్తా. బెల్లంకొండ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులు పెడ్తున్నారు. శరణ్‌ను లీగల్ గా ఎదుర్కొంటా.’ అని బెల్లంకొండ సురేశ్ అన్నారు.
తనకు కోర్టు నుంచి కాని సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదని… తనపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఉంటే ఇవ్వాలని అన్నారు. ‘నాతో పాటు నా కుమారుడి పేరు లాగారు, కనుక ఈ విషయంలో ఎంత పెద్ద మనిషి ఉన్నా వదిలిపెట్టను, అతను క్షమాపణ చెప్పినా నేను వదలను’ అంటూ బెల్లంకొండ సురేష్ భావోద్వేగానికి లోనయ్యారు.