పాలనలో విప్లవం తీసుకొచ్చే ప్రయత్నం : మంత్రి బొత్స సత్యనారాయణ
చంద్రబాబుకు సమిష్టి అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనే లేదు అని పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబుకు విశాల దృక్పథం కరువైందని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకోవడమే చంద్రబాబుకు తెలుసు అని అన్నారు. ఏ విషయంలో రాముడితో చంద్రబాబును లోకేష్ పోలుస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు.. ఎన్టీఆర్ సిద్ధాంతాలు వదిలేసి కొత్త సిద్ధాంతాలు తెచ్చాడు. చంద్రబాబుకి రాముడు అనే మాట ఎలా సరిపోద్దో చెప్పాలన్నారు. సొంత మామకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్డు అని మళ్లీ అదే పాట అందుకున్నాడుని, అవి కట్టింది వైఎస్సార్ అని అన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం ప్రవేశపెట్టింది అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ప్రాజెక్టులపై డాంబికాలు చెప్పుకుంటున్నాడని, అవన్నీ చేస్తే నీ కొడుకు నీ ఇంటి పక్కనే ఎందుకు ఓడిపోయాడని ప్రవ్నించారు. ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబు నాయుడే అన్నారు. వైఎస్ఆర్ విధానాలను మళ్లీ అమలు చేస్తున్నది సీఎం జగనే అని అన్నారు. అమరావతి భూములతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు.
టీడీపీ జలసత్వాలు అయిపోయాయని, ఎటువంటి విధానాలు లేవు అని మండిపడ్డారు. పరిపాలనలో ఓ విప్లవం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. కేబినెట్‌పై నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై ఆయన స్పందిస్తూ.. కూర్పు అంటే ఎన్నో సమీకరణాలు ఉంటాయన్నారు. పార్టీ తల్లి లాంటిదని.. అందరం కలిసికట్టుగా ఉంటామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ మాట చెబితే దానికి కట్టుబడి ఉంటామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.