సౌత్, నార్త్ అనే విభజన కరెక్ట్ కాదు.. అంతా ఒకే ఇండస్ట్రీ: అక్షయ్
గత కొద్ది కాలంగా సౌత్ సినిమాలు బాలీవుడ్లో కూడా భారీ విజయం సాధిస్తుండటంతో నార్త్ ఇండస్ట్రీ, సౌత్ ఇండస్ట్రీ అని మాట్లాడుతున్నారు. ఇది గతంలో ఉన్నా ఈ మధ్య మరింత ఎక్కువ అయింది. బాలీవుడ్ పరిశ్రమపై సౌత్ యాక్టర్లు కామెంట్లు చేయడం, వాటికి బాలీవుడ్ యాక్టర్లు కౌంటర్లు ఇవ్వడం జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇది భాషా వివాదంగా కూడా మారి సౌత్, బాలీవుడ్ వాళ్ళు సోషల్ మీడియాలో మాటకు మాట అనుకున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ వివాదంలో దూరారు. దీంతో కొన్ని రోజులుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది.
హిందీ చిత్ర పరిశ్రమపై ఇటీవల కన్నడ నటుడు కిచ్చా సుదీప్ వ్యాఖ్యలు చేయగా దానికి హిందీ నటుడు అజయ్‌దేవ్‌గణ్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో చర్చ సాగింది. అది భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా ఇదే విషయమై బాలీవుడ్ అక్షయ్ కుమార్ స్పందించారు. తాను నటించిన ‘పృథ్వీరాజ్’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అక్షయ్ ఈ విషయమై మాట్లాడారు.
సినిమా ఇండస్ట్రీని ఉత్తరాది, దక్షిణాది అని ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదని అక్షయ్ కుమార్ అన్నారు . ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడితే అంతే చాలన్నారు. బ్రిటీష్ పాలకులు ఇండియాను విభజించి పాలించారని, ఇప్పటికీ దాని నుంచి మనం ఏమీ నేర్చుకోలేదని అనిపిస్తోందని అక్షయ్ తెలిపారు. ఉన్నది ఒకటే ఇండస్ట్రీ అని, దాన్ని మెరుగుపర్చేందుకు మనమందరం కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. అంతేకానీ సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ అని మాట్లాడితే తనకసలు నచ్చదన్నాడు.