వేడి పుట్టిస్తున్న రోజా వర్సెస్ అచ్చెన్న సవాళ్లు !
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజకీయ సవాళ్లు విసురుకున్నారు. రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని ఒకరిని ఒకరి ప్రతి సవాల్ చేసుకున్నారు. వీరి సవాళ్లు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఇటీవల రైతు శిక్షణా శిభిరం కార్యక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు వస్తాయన్నారు. ఇది రోజాకు నచ్చలేదు. మహిళా దినోత్సవంలో పాల్గొన్న రోజా ప్రసంగిస్తూ.. చంద్రబాబు, లోకేష్ తలకిందులుగా తపస్సు చేసినా 160 సీట్లు రావన్నారు. ఇప్పుడున్నఇరవై మూడు సీట్లు కూడా నిలబెట్టుకోలేరని విమర్శించారు.
అంతటితో ఆగలేదు..అచ్చెన్నాయుడుపై బాడీషేమింగ్ విమర్శలు చేశారు. గట్టి చట్నీ గట్టిగా తింటే అచ్చెన్నాయుడు 160 కిలోలు పెరుగుతారేమోగానీ. ఇప్పుడున్న 23 సీట్లు రావడం కూడా కష్టమని నీకు సరదాగా ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు రా.. అంటూ సవాల్ చేశారు. రోజా విమర్శలపై అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. నగరిలో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. అక్కడ టీడీపీ ఓడిపోతే.. సాధారణ ఎన్నికల్లో అక్కడ పోటీపెట్టబోమన్నారు.
చంద్రబాబు, అచ్చెన్నాయుడు తల కిందుల తపస్సు చేసినా 160 సీట్లు రావంటున్నారని .. రోజాకు ధైర్యముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్ధపడాలని ప్రతి సవాల్ విసిరారు. నగరిలో టీడీపీ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాల్లో తాము పోటీ చేయబోమని అచ్చెన్న ప్రకటించారు. సింపతీ కోసం కోడి కత్తి డ్రామా ఆడారు.. అయినా దాని వల్ల సింపతీ రాలేదని.. మరింత సింపతీ కోసం తన బాబాయిని చంపేసినా పట్టించుకోని వ్యక్తి జగన్ అని ఆరోపించారు. 151 సీట్లు వచ్చినా.. అతి తక్కువ కాలంలో సీఎం వైఎస్ జగన్ విపరీతమైన వ్యతిరేకతను పెంచుకున్నారని విమర్శించారు. అచ్చెన్న సవాల్‌పైరోజా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!