బార్లీ గింజలతో కలిగే ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే మాత్రం..!
మనకు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వాటిలో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బార్లీలో ఉండే విటమిన్-బి నీటిలో కరిగే తత్వం కలిగినది. బార్లీని వృధాగా పోనివ్వకూడదనుకుంటే బార్లీ గింజలను, వాటిని వేసి ఉడికించిన నీళ్లతో సహా తీసుకోవాలి. బార్లీలో బి-విటమిన్లు, పీచు పదార్థాలు వంటివి అత్యధిక భాగంపై పొట్టులోనే ఉంటాయి కాబట్టి బి విటమిన్ కావాలనుకునేవారు బార్లీ గింజలను యధాతథంగా వాడగలిగితేనే మంచిది. బార్లీ వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
పావు కప్పు బార్లీ గింజలను రెండున్నర లీటర్ల నీళ్లకు కలిపి సగం నీళ్లు మిగిలేంతవరకూ మరిగించి, దించి వడపోసుకొని తాగాలి. ఇలా రెండురోజులపాటు చేస్తే పేగుల పనితీరు మెరుగవుతుంది. వాపులతో కూడిన జ్వరాల్లో బార్లీని ఆహార ఔషధంగా వాడవచ్చు. చిన్నపిల్లలకు బార్లీని పాలతోగాని లేదా పండ్ల రసంతో గాని కలిపి ఇవ్వవచ్చు. జ్వరంతో నీరసం ఉంటే బార్లీ కషాయానికి గ్లూకోజ్ కలిపి తీసుకుంటే వెంటనే శక్తి వస్తుంది. బార్లీ గింజలతో గంజిని తయారుచేసి, మజ్జిగను, నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధుల్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మూత్రం జారీ అవటం వల్ల శరీరంలో వాపు దిగుతుంది.
ఇది నెఫ్రైటిస్, సిస్టైటిస్ వంటి సమస్యల్లో సైతం ఉపయుక్తంగా ఉంటుంది. మూత్ర విసర్జన కష్టంగా ఉంటే బార్లీ కషాయానికి బెల్లం, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. బాలింతల్లో తల్లిపాలు తక్కువగా పడితే బార్లీని పాలతో కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. బార్లీని నీళ్ళలో నానవేసి రోజూ తాగితే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. అలాగే ఒంటికి నీరు చేరిన గర్భిణి స్త్రీలు బార్లీ నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడేవారు ప్రతీరోజూ బార్లీ గంజిని తాగితే బలహీనత, నీరసం తగ్గి నూతన శక్తి లభిస్తుంది. బార్లీని రవ్వలాగా, మెత్తటి పిండిలా చేసి దానితో ఫలహారాలను చేసి తింటే త్వరగా, తేలిగ్గా జీర్ణమవుతాయి.