మా పార్టీలో సీఎం అభ్యర్థులకు కొదవలేదు : ఏపీ బీజేపీ
బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆ పార్టీనేత పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో 0.83 శాతం మేర ఓట్లే వచ్చాయని తెలిపారు. కేంద్రం నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో వైసీపీ వచ్చాక అభివృద్ధి రివర్సులో ఉందని విమర్శించారు. పెట్టుబడిదారులు పక్క రాష్ట్రానికి వెళ్లిపోతున్నారని తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలు సక్రమంగా లేవని పురంధరేశ్వరి ధ్వజమెత్తారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమవుతుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. వారి సొంత అజెండా తప్పితే రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. బీజేపీ, జనసేన కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాయని, అధికారంలోకి రావాలన్నదే తమ ఆలోచన అని, ఆ ప్రకారమే కార్యాచరణ సిద్ధం చేసి ముందుకు వెళతామని చెప్పారు. సీఎం అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని ల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలను తరిమికొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు.
బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై ప్రజాగ్రహ సభ నిర్వహించామని తెలిపారు. బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థులకు కొదవలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు బీజేపీకి నియమావళి ఉందని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటనలో సంస్థాగత విషయాలపై దిశా నిర్దేశం చేస్తారన్నారు. రాజమండ్రి సభలో నడ్డా బీజేపీ ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడతారని చెప్పారు.