దళితుల హత్యను అంత తేలిగ్గా తీసుకోవద్దు : వర్ల రామయ్య
రాష్ట్ర పోలీసు వ్యవస్థ మాజీ డీజీపీ సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి బయటపడాలని పోలీసు వ్యవస్థని కోరుతున్నానని టీడీపీ పొలిట్ బ్యూరో వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ప్రశ్నించే గొంతును ఎందుకు నొక్కుతున్నారు? సవాంగ్ మార్క్ పోలీసింగ్.. ఆయన చేసింది కరెక్టు పోలీసింగ్ కాదు. ఆయన డీజీపీగా ఉన్నప్పుడు పోలీసింగ్ అది చట్టబద్దమైన పోలీసింగ్ కాదని ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాధరెడ్డికి విన్నవిస్తున్నాను. సవాంగ్ మార్క్ పోలీసింగ్ లేదు అని ప్రజంట్ డీజీపీ చెప్పాలి. తూర్పు గోదావరి నుంచి సుబ్రమణ్యం అనే మరో దళితుడు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ చేతిలో బలైపోయాడు. అసలు సిసలైన కారణాన్ని అన్వేషించాలి.
ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ విషయంలో పోలీసులు వేసిన అడుగలన్నీ తప్పటడుగులే. ఎక్కడ కూడా సరైన అడుగు పడలేదు. ఎందుకు తప్పటడగులు వేయాల్సి వచ్చిందో చెప్పాలి. ఎవర్ని రక్షించడానికి తప్పటడుగులు వేశారు? సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో నడుస్తున్నారని తెలుస్తోంది. ఎవరి కోసం ఈ మౌనం? ఎవరి కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటున్నారు? శవాన్ని అక్కడ పెట్టి వెళ్తే ఆ శవం ఎక్కడి నుంచి తెచ్చావ్? అని పోలీసులు అడగాల్సివుంది. పోలీసులు ఉదయ్ భాస్కర్ గన్ మెన్ లతో మాట్లాడలేదు. ఎస్పీ, డీఎస్పీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరో, సబ్ ఇన్స్ పెక్టరో ఎవరో ఒకరు శవాన్ని తెచ్చినవారితో మాట్లాడాలి.
పోలీసు వ్యవస్థ ఈ అపవాదును ఎందుకు మోస్తోందని నేను ప్రశ్నిస్తున్నాను. నేరస్థుల్ని రెండు గుద్దాలి, బేడీలు వేసి రిమాండుకు పంపాలి. ఎమ్మెల్సీని నిలదీయాలి. ఎమ్మెల్సీకున్న గన్ మెన్ లని విచారించరా? గన్ మెన్ కు ఫోన్ చేస్తే చెబుతాడుకదా? మీ ప్రతిష్టని ఎందుకు పణంగా పెడుతున్నారు? బాధాతప్త హృదయంతో ప్రశ్నిస్తున్నాను. పోలీసు వ్యవస్థను ఎగతాళి చేయాలని నాకు లేదు. సుబ్రమణ్యం శవానికి పోస్టుమార్టం చేసి సమాధి చేయాలనే తపన తప్పితే ఏం జరిగిందో తెలుసుకోవాలన్న తాపత్రయం పోలీసు వ్యవస్థలో ఎందుకు కనపడలేదు.’’ అని విమర్శించారు.