బీహార్ అభివృద్ధి కోసం నా పాదయాత్ర : ప్రశాంత్ కిషోర్
దేశంలోనే అత్యంత పేద రాష్ట్రం బీహార్ అని, బీహార్ కు లాలూ, నితీశ్ 30 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. కొత్త ఆలోచనలతో బీహార్ ను ముందుకు తీసుకెళ్లాలని, నితీశ్ హయాంలో బీహార్ చాలా వెనకబడిందని విమర్శించారు. బీహార్ ను అభివృద్ధి చేయడానికి అనేక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీహార్ ను మార్చాలనుకునేవారు ఏకతాటిపైకి రావాలన్నారు. బీహార్ అభివృద్ధి కోసమే జన్ సూరాజ్ అని, రానున్న 3, 4 నెలల్లో 18 వందల మందితో ఒక వేదిక నా మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు.
అనంతరం 1800 మందితో పార్టీ పెట్టడంపై ఆలోచన చేస్తామని, ఆ పార్టీ ప్రశాంత్ కిశోర్ ది కాదు.. అందరి పార్టీగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ పెట్టడం గురించి ఇప్పుడు మాట్లాడడం లేదని, బీహార్ అభివృద్ధి కోసం పాదయాత్ర చేస్తానని, అక్టోబర్ 2 నుంచి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర తెలిపారు. తన ప్రధాన లక్ష్యం బీహార్ ప్రజలను కలవడమని, బీహార్ ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకోవడమని స్పష్టం చేశారు.
కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం ద్వారానే ఇది సాధ్యం అని, కలిసికట్టుగా నడిస్తే ఈ దురావస్థ నుంచి బయటపడతామని పేర్కొన్నారు. తన అభిప్రాయంతో కలిసి వచ్చే వారిని నా ఉద్యమంలో చేర్చుకుంటామని, ఏడాదిలోగా అందరినీ కలుసుకునేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. జన్ సురాజ్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతానని తెలిపారు. అయితే పీకే ఇప్పటికే కొన్ని పార్టీలకు వ్యూహకర్తగా పని చేస్తున్నారు. వాటిని కొనసాగిస్తూ రాజకీయాల్లోకి వస్తారా..లేకుంటే వ్యూహకర్తగా మానుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.