నేను మాటల మంత్రిని కాదు, చేతల మంత్రిని: మంత్రి నారాయణ – ముగిసిన జనచైతన్య యాత్రలు
November 30, 2016
నగరంలో కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జనచైతన్య యాత్రలు మంగళవారం తో ముగిసాయి. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలిపి వారిని చైతన్య పరచడమే ధ్యేయంగా జరిగిన ఈ యాత్రల ముగింపు వేడుక నగరంలోని నర్తకి సెంటర్ లో అట్టహాసంగా జరిగింది. తొలుత నగరంలో తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. వీఆర్సీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన నాయకులు ఆఖరులో నర్తకి సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ర్యాలీ ఆద్యంతం పార్టీ కార్యకర్తలు హుషారుగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన ముగింపు సభ కళాకారుల నృత్యాలు, తీన్మార్ వాయిద్యం, కార్యకర్తల జేజేలు, నినాదాలతో ఘనంగా ప్రారంభం అయింది. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కట్టుబడివుందని తెలిపారు. తాను మాటల మంత్రిని కాదని, చేతలతో అభివృద్ధి చూపిస్తున్నానని తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనచైతన్య యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం ప్రజలకు తమపై ఉన్న నమ్మకం అని తెలిపారు. నగర అభివృద్ధికి తాగునీరు, డ్రైనేజీ నిర్మాణాలకు 1100 కోట్ల రూపాయల నిధులను తీసుకురావడం జరిగిందన్నారు. కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నగరం మొత్తం ఎల్ఈడీ వెలుగులు తెచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేసారు. వరదలు ఏర్పడితే నగరం ముంపునకు గురికాకుండా 13 కాలువల్లో పూడికలు చేపట్టామని తెలిపారు. వెంకటేశ్వరపురం వద్ద 5000 ఇళ్ల నిర్మాణం చేపట్టామని, కాలువల ఆక్రమదారులను అక్కడికి మార్చాకే ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ సభ్యులు ప్రభుత్వం పై ఏడుస్తున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి వై.ఎస్.జగన్ అడుగడుగునా అడ్డుపడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, నగర టి.డి.పి ఇంఛార్జ్ ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు నరసింహులు, మాజీ మంత్రి రమేష్ రెడ్డి, గ్రంధాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మెన్ కిలారి వెంకటస్వామినాయుడు, నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు, తాళ్ళపాక అనురాధ, జడ్.శివప్రసాద్, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ధర్మవరపు సుబ్బారావు, ఆనం జయకుమార్ రెడ్డి, ఆనం రంగమయూర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.