ఆ ప్రాంతమంతా ముళ్ల కంచెలతో కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తోంది : అచ్చెన్నాయుడు
ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న అధికార దాహంతో ఎన్నికల్లో గెలవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా అడ్డమైన హామీలను జగన్ రెడ్డి గుప్పించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రచారంలో చిటికెలేసి అన్ని సభల్లో అధికారంలోకి వచ్చిన వారంలో రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన మాట ముఖ్యమంత్రి మర్చిపోయినా..నమ్మిన ఉద్యోగులు మర్చిపోలేదని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ఇచ్చిన హామీనే అమలు చేయాలని అడుగుతుంటే రెండు రోజుల నుండి ఉపాధ్యాయ సంఘాలను నేతలను అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ప్రాంతమంతా ముళ్లకంచలతో కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తోందన్నారు.
న్యాయబద్ధమైన హక్కులను అడిగితే అరెస్టు చేస్తున్నారని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారు. జగన్ అబద్ధమాడడు.. జగన్ మాట ఇస్తే తప్పడు అంటూ సినిమా డైలాగులు కొట్టారని, ఇచ్చిన మాట మీద జగన్ రెడ్డి నిలబడాలని తెలిపారు. జగన్ కు అవగాహన లేక సీపీఎస్ రద్దు చేస్తానన్న హమీ ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పీఆర్సీ అమలులోనూ ఉద్యోగులను నిలువునా మోసం చేశారని, ఉద్యోగ సంఘాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే చర్యలు ముఖ్యమంత్రి ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు.
తాడేపల్లిలో తప్పించుకున్నామని సంబరపడ్డా భవిష్యత్ లో రాష్ట్రంలో తిరిగేటప్పుడైనా నిరసనలు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు. ఉద్యోగులకు కనీసం జీతం కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని, జగన్ రెడ్డి చేసిన మోసాన్ని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని, జగన్ రెడ్డి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకు ఉద్యోగుల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్ధతు తెలుపుతుందని ప్రకటించారు.