వంశీ దారెటు..?
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గాలి వీచినా గన్నవరంలో వంశీ గెలుపును జగన్ ప్రభంజనం ఆపలేకపోయింది. తక్కువ మెజార్టీతో గెలిచినప్పటీకీ రెండోసారి అక్కడి ప్రజలు వంశీని ఆదరించారు. అంతవరకు బాగానే ఉంది. తదనంతరం వంశీ కొడాలి నానితో మరింత సన్నిహితంగా మెలగడం, అనంతరం టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే గన్నవరం సీటు తనకే వస్తుందని, ఆ హామీ మేరకే వైసీపీకి వంశీ అనుకూలంగా వ్యవహరించారని తెలిసింది. గన్నవరం వైసీపీ అభ్యర్థిగా తానే ఉంటానన్న నమ్మకంతో వంశీ చెలరేగిపోయిరు. సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు..అసెంబ్లీలో భువనేశ్వరిని వ్యక్తి గతంగా దూషించడానికి కారణం కూడా వంశీనే అన్న కోపం టీడీపీ శ్రేణుల్లో బలంగా ఉంది.
ఆ తర్వాత వంశీ తన మాటలకు క్షమాపన చెప్పారు. ఇదిలా ఉండగా…వంశీకి వైసీపీ నుండే చుక్కెదరువుతోంది. వైసీపీ కార్యకర్తలు వంశీ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు తమను అక్రమ కేసులతో వేధించారని, అలాంటి వ్యక్తిని తమ నాయకుడిగా ఎలా అంగీకరిస్తామని బాహాటంగానే చెప్తున్నారు వైసీపీ శ్రేణులు. కేవలం కేసుల నుండి తప్పించుకోవడానికే వైసీపీకి మద్ధతుగా వ్యవహిరస్తున్నారని విమర్శిస్తున్నారు. దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకట్రావు కూడా వంశీకి సీటు ఇస్తే సహించేది లేదని తెగేసి చెప్తున్నారు.
తమలో ఎవరో ఒకరికి సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వంశీకి సీటు ఇస్తే ఓడించి తీరుతామని కార్యకర్తలతో లేఖలు కూడా అధిష్టానానికి రాయించారు. దీంతో రాజకీయ భవిష్యత్ పై వంశీ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. అనవసరంగా టీడీపీ నుండి వచ్చానని, టీడీపీలో ఉంటే మరింత మాస్ లీడర్ గా ఎదిగేవాడినని తనలో తాను మదనపడుతున్నట్లు వినిపిస్తోంది. ఇటు వైసీపీలో సీటు రాక..టీడీపీలో చేరలేక..రాజకీయాలు వదిలేయలేక వంశీ మల్లుగుల్లాలు పడుతున్నారని తమ అనుచరులు వాపోతున్నారు.