నేను దుర్మార్గున్ని..మీకు తెలియదేమో.? : వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబురాజు
ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబురాజు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. సభలో వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఎక్స్ట్రాలు చేయొద్దంటూ మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే…ఎలమంచిలిలో నిన్న ఓ సభను నిర్వహించారు.నేనెంత మంచి వాన్నో అంత దుర్మార్గున్ని. మీకు తెలీదేమో. ఈ సంగతి జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. మీ వాలంటీర్ ఉద్యోగాలు ఇంకా రెగ్యులర్ కూడా చేయలేదు. ఎక్స్ ట్రాలు చేయొద్దు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయండి. లేదంటే ఇంటికి పంపించేస్తా. ఉద్యోగం చేయనివ్వను అంటూ రెచ్చిపోయారు.
శనివారం వాలంటీర్లకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పీఎస్ సత్యనారాయణ సచివాలయ ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని, దీని వల్ల సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. దీంతో కన్నబాబురాజు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు. కడుపున పుట్టిన కొడుకులు తప్పు చేసినా క్షమించను. కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయండి. లేకపోతే ఇంటికి పంపించేస్తా అని హెచ్చరించారు. అయితే కన్నబాబు రాజు వార్నింగ్ ఇవ్వడం ఇది మొదటి సారి కాదు.
ఇటీవల ఎలమంచిలి మున్సిపాలిటీలో వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రధాన కార్యక్రమానికి ఆయన వచ్చారు. అయితే వాలంటీర్లు అప్పటికి రాలేదు. దీంతో వాలంటీర్లు సమయపాలన పాటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మరి కొందరు వచ్చి ఇచ్చిన సమాధానంతో ఆయన సంతృప్తి చెందలేదు. సేవా పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఆదేశించారు. తాజాగా మారోసారి ఆయన నుండి హెచ్చరికలు రావడంతో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులంతా గుస్సాగా ఉన్నారు.